ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. శివాలయాల్లో భక్తుల సందడి.. దీపారాధనతో ఆధ్యాత్మిక శోభ
- పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ తీసుకోవాలి - November 25, 2026
- ప్రజలు గ్రామాభివృద్ధికి సహకరించాలి : కట్టంగూర్ సర్పంచ్ శ్యామల శేఖర్ - November 25, 2026
- అయ్యప్పలకు అన్నప్రసాద వితరణ - November 25, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 24: మండల వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలను మంగళవారం భక్తులు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించే పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని శివాంజనేయ లక్ష్మీనరసింహ స్వామి, లక్ష్మీనారాయణ, శ్రీ సాయి మణికంఠ దేవాలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఆలయాల్లో పురోహితులు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారికి పూజలు చేశారు. భక్తులు తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకుని దీపారాధన చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలను వెలిగించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, దీపాల వెలుగులతో దేవాలయాలు శోభాయమానంగా కనిపించాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో పురోహితులు నర్సింగోజు భిక్షమాచారి, శ్రీనివాస శర్మతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
