పేదరికాన్ని జయించి హైకోర్టు న్యాయవాదిగా భూంపల్లి రవితేజ
- లింగంపేట్ టీఆర్ఎస్లో ఇద్దరికి కీలక పదవులు - November 21, 2026
- పేదరికాన్ని జయించి హైకోర్టు న్యాయవాదిగా భూంపల్లి రవితేజ - November 21, 2026
- రైతుల ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం - November 21, 2026
ఎర్రపహాడ్ గ్రామం నుంచి ఉన్నత న్యాయస్థానం వరకు.. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్న విద్యార్థి నాయకుడు
పేదరికం చదువుకు అడ్డంకి కాదని, కష్టపడే తత్వం, పట్టుదల, స్పష్టమైన లక్ష్యం ఉంటే ఎన్ని అవరోధాలనైనా అధిగమించి ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని విద్యార్థి నాయకుడు భూంపల్లి రవితేజ నిరూపించారు. రైతు కుటుంబంలో జన్మించి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగించిన ఆయన హైకోర్టు న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేయడం గ్రామానికి, కుటుంబానికి గర్వకారణంగా నిలిచింది.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన బాలరాజ్–గంగమణి దంపతుల పెద్ద కుమారుడైన రవితేజ చిన్ననాటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తన లక్ష్యం దిశగా ముందుకు సాగారు. విద్యార్థి దశ నుంచే సామాజిక సమస్యలపై అవగాహన కలిగి, విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తుతూ, విద్యా హక్కులు, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం నిరంతరం పోరాటం చేశారు. ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే న్యాయ విద్యను అభ్యసించి నేడు హైకోర్టు న్యాయవాదిగా కొత్త బాధ్యతలను స్వీకరించారు.
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువును మధ్యలో ఆపకూడదని, విద్య ప్రతి ఒక్కరి హక్కు అని పేర్కొన్నారు. సరైన లక్ష్యం, పట్టుదల, నిరంతర శ్రమ ఉంటే పేదరికాన్ని అధిగమించి అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. తన న్యాయవాద వృత్తి ద్వారా పేదలు, బలహీన వర్గాలకు న్యాయపరమైన సహాయం అందించడం, రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆర్థిక స్థోమత లేని వారికి సైతం న్యాయం అందుబాటులో ఉండేలా తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.
తన ఈ విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గురువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, విద్యార్థి ఉద్యమ సహచరులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రైతు కుటుంబం నుంచి వచ్చి, విద్యార్థి ఉద్యమాల్లో ప్రజల పక్షాన నిలబడి, నేడు హైకోర్టు న్యాయవాదిగా ఎదిగిన భూంపల్లి రవితేజ ప్రస్థానం నేటి యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. తన విద్యను, న్యాయ పరిజ్ఞానాన్ని సమాజ సేవకు అంకితం చేయాలనే ఆయన సంకల్పం అభినందనీయం. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి పేదలకు, అణగారిన వర్గాలకు న్యాయం అందించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
