మస్కట్‌లో ఉట్నూరు సాయగౌడ్‌కు ఘనంగా వీడ్కోలు

మస్కట్: ఒమాన్‌లోని పూలే అంబేడ్కర్ ఆర్గనైజేషన్ (PAO) ఆధ్వర్యంలో ఉట్నూరు సాయ గౌడ్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. మస్కట్ బల్దియాలో గత 27 సంవత్సరాలుగా సేవలందించి, పదవీ విరమణ అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్తున్న పూలే అంబేడ్కర్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యుడు సాయ గౌడ్‌ను కమిటీ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఇదే సందర్భంగా మరో కమిటీ సభ్యుడు ప్రభాకర్ అలియాస్ భూమేష్‌ను కూడా సత్కరించారు.

ఈ సందర్భంగా అతిథిగా హాజరైన అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఒమాన్ సెక్రటరీ సందీప్ మెహతా మాట్లాడుతూ, “మనం ఎక్కడ ఉన్నా అంబేడ్కర్ వాదమే మనల్ని కలుపుతుంది. వ్యక్తిగతంగా ఎలాంటి బంధుత్వం లేకపోయినా, అంబేడ్కర్ అనే అనుబంధం మనందరినీ సమాజం కోసం కలిసి పనిచేసేలా చేస్తోంది” అని అన్నారు. ఒమాన్ తెలంగాణ సమితి ప్రతినిధులు అహ్మద్, సుంకరి రవి, కుమార్ లు మాట్లాడుతూ, సాయన్న సమాజ సేవలో భాగస్వాములవుతూ వారు చేసిన సేవలు మనందరికీ ఆదర్శం అన్నారు.

ఈ కార్యక్రమంలో సాయ గౌడ్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను, ఆయన అందించిన సేవలను కమిటీ సభ్యులు గుర్తుచేసుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్న ఆయన సేవలను కొనియాడారు. సన్మానానికి స్పందించిన సాయ గౌడ్ మాట్లాడుతూ, తనకు ఇంతటి గౌరవం, గుర్తింపు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని, తనను ఆప్యాయంగా గౌరవించిన పూలే అంబేడ్కర్ ఆర్గనైజేషన్ సభ్యులకు భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని అన్నారు.

ఈ కార్యక్రమంలో దులూర్ శేఖర్ , దుబ్బాక నవీన్ పాటలు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పూలే అంబేడ్కర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు వేణు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సమన్వయకర్త ఎన్జీఆర్ గంగాధర్, కమలాకర్, లక్ష్మన్, సంజీవ్, ఏపీ నాగరాజు, క్యాంపు బాస్ నాగరాజు, సుభాష్, నారి నరేష్, జోయస్, మహిళా సంఘాల నాయకులు, ఇతర సంఘాల ప్రతినిధులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

You may also like...