రాజ్యాంగ ప్రవేశిక ఆశయాలను వివరించిన బాదే వెంకటేశం
- అమెరికా వీడండి.. లేదంటే ఉద్యోగానికి స్వస్తి చెప్పండి! - November 27, 2026
- రాజ్యాంగ ప్రవేశిక ఆశయాలను వివరించిన బాదే వెంకటేశం - November 27, 2026
- రాజ్యాంగ పరిరక్షణే అందరి బాధ్యత: రహీం - November 27, 2026

జ్ఞాన తెలంగాణ, రామగుండం నియోజకవర్గం: రామగుండం 8వ కాలనీలోని ఆర్జీ-2 ఏరియా ఏపీజే అబ్దుల్ కలాం క్రీడా ప్రాంగణంలో గురువారం నవంబర్ 26న ఉదయం 6 గంటలకు 77వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రీడాకారులు, సింగరేణి కార్మికులు, సీనియర్ సిటిజన్లు, వాకర్స్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఫిట్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు, ఫిజికల్ అండ్ యోగా ట్రైనర్ బాదే వెంకటేశం భారత రాజ్యాంగ ప్రవేశిక ఆశయాలను వివరించారు. రాజ్యాంగం అమలులోకి రాకముందు సామాజికంగా అణగారిన వర్గాలు ఎదుర్కొన్న వివక్ష, అసమానతలను ప్రస్తావిస్తూ, ఛత్రపతి శివాజీ మహారాజ్, సాహూ మహారాజ్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, ఫాతిమా బేగం తదితర సంఘ సంస్కర్తల పోరాటాలు, త్యాగాలను గుర్తుచేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ రూపకల్పనకు సాగిన కృషి చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టిందని, 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందని తెలిపారు. విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో సమాన అవకాశాలు, దేశ సంపదలో న్యాయమైన భాగస్వామ్యం, సమాన హక్కులు, మానవతా విలువలు ప్రతి పౌరుడికి అందాలనే రాజ్యాంగ ప్రవేశికలోని లక్ష్యాలను వివరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ వాటి పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సందేనవేన కుమార్ యాదవ్, మేకల ఓదెలు, ఐలయ్య, కస్తూరి నాగరాజు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
