చౌదరిగూడెం పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు
- సీఈసీ రాజీనామా వరకు పోరుఆగదు - October 7, 2026
- చౌదరిగూడెం పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు - October 7, 2026
- అయ్యర్ విధ్వంసం..విండీస్‌పై దుమ్మురేపిన భారత్ - October 7, 2026

- షాద్‌నగర్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. రూ.10 వేల జరిమానా
- షాద్ నగర్ న్యాయమూర్తి ఎస్. స్వాతిరెడ్డి తీర్పు వెల్లడి
- కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సబియా సుల్తానా వాదనలు
చౌదరిగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి షాద్‌నగర్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌదరిగూడెం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 121/2021గా కేసు నమోదైంది. ఈ కేసు ప్రత్యేక సెషన్స్ కేసు నంబర్ 55/2022గా విచారణకు వచ్చింది. భారతీయ శిక్షాస్మృతిలోని 354-డి, 323, 506 సెక్షన్లతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్‌విత్ 12 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో చౌదరిగూడెం మండలానికి చెందిన షేక్ అజ్మీర్ (42)ను నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. కేసును విచారించిన షాద్‌నగర్‌లోని అత్యాచారం, పోక్సో కేసుల విచారణ, పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్. స్వాతిరెడ్డి బుధవారం తీర్పు వెలువరించారు.
నిందితుడిని ఐపీసీ సెక్షన్ 506, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్‌విత్ 12 కింద దోషిగా నిర్ధారించిన కోర్టు.. ఒక్కో సెక్షన్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా నెల రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సబియా సుల్తానా వాదనలు వినిపించారు. దర్యాప్తు అధికారిగా చౌదరిగూడెం ఎస్ఐ కె. వెంకటేశ్వర్లు వ్యవహరించారు. షాద్‌నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరిగింది. ప్రస్తుతం చౌదరిగూడెం ఎస్ఐగా బి. వెంకటేష్ విధులు నిర్వహిస్తున్నారు. కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ పి శ్రీశైలం, సమన్స్ విభాగం సిబ్బంది శ్రీ నికేతన్, లైజన్ ఆఫీసర్ సక్రియా నాయక్ మహిళా కానిస్టేబుల్ కే జ్యోతి తదితరులు ఈ కేసు సహకరించారు
