భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- గడ్డం వెంకటస్వామి ఆశయాలకు ఘన నివాళి - October 5, 2026
- మహాలక్ష్మికి పెరుగుతున్న ఆదరణ..3 నెలల్లో 97.20 లక్షల అదనపు ప్రయాణాలు - October 5, 2026
- ఎన్నికల వ్యవస్థపై కాంగ్రెస్ మూడు డిమాండ్లు - October 5, 2026

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. భీమ్‌గల్‌లో హోటల్ నిర్వహిస్తున్న సుధాకర్ పోలీస్‌స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు సమాచారం. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో తొలుత ఆర్మూర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.
హోటల్‌ను రాత్రి 10 గంటల తర్వాత కూడా నిర్వహిస్తూ, బయట టేబుళ్లు ఏర్పాటు చేశారనే ఆరోపణలపై సుధాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి సోమవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉందని, అందుకు సంబంధించి పోలీసులు ఆయనను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సమయంలో మనస్తాపానికి గురైన సుధాకర్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటనపై సుధాకర్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పోలీసుల వేధింపుల కారణంగానే ఆయన ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లోనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
