గాలేలో గర్జించిన టీమిండియా..
- రూ.8,452 కోట్ల పీఎం కేర్స్..ఖర్చు మాత్రం రూ.87 లక్షలా? - August 19, 2026
- తెలంగాణ ఓపెన్ స్కూల్ SOCIETY (TOSS)అడ్మిషన్లు ప్రారంభం - August 19, 2026
- సంజీవయ్య పార్క్‌లో అద్భుత మల్టీమీడియా షో - August 19, 2026

జ్ఞానతెలంగాణ,గాలే: శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా అదరగొట్టింది. గాలే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 165 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. ఐదో రోజు 84/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించి భారత బౌలర్ల ధాటికి 206 పరుగులకే కుప్పకూలింది.
శ్రీలంక బ్యాటర్లలో సోనాల్ దినుష 84 పరుగులతో, ధనంజయ డిసిల్వా 59 పరుగులతో పోరాడినా జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో 6/55తో లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
సుతార్ తన స్పిన్‌తో లంక బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ముఖ్యంగా 76వ ఓవర్లో అతడు చేసిన బౌలింగ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆ ఓవర్లో సోనాల్ దినుష, ప్రభాత్ జయసూర్య, లాహిరు కుమారలను వరుసగా పెవిలియన్‌కు పంపి ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో తీసుకున్న వికెట్లతో కలిపి మ్యాచ్‌లో సుతార్ మొత్తం 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం శ్రీలంక 284 పరుగులకే పరిమితమైంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులు చేసి లంక ముందు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాటింగ్‌లో దేవదత్ పడిక్కల్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా 167 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ విలువైన 44 పరుగులు సాధించాడు. అతడి సమగ్ర ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం మారకపోయినా.. పాయింట్ల శాతాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం 60 పాయింట్లతో 53.33 శాతం విజయ శాతాన్ని నమోదు చేస్తూ ఐదో స్థానంలో ఉంది.
