వర్షం దెబ్బకు భారత్–న్యూజిలాండ్ మూడో వన్డేకు బ్రేక్!

జ్ఞాన తెలంగాణ, స్పోర్ట్స్: భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య హామిల్టన్‌ వేదికగా జరగాల్సిన నిర్ణయాత్మక మూడో వన్డేకు భారీ వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. కీలకమైన ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, వరుణుడు ఆటంకం సృష్టించడంతో నిరాశ ఎదురైంది. తొలుత వాతావరణం కొంత అనుకూలంగా మారడంతో మ్యాచ్‌ నిర్వహణపై అంపైర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదయం 7:32 గంటలకు టాస్‌ నిర్వహించి, 8 గంటలకు మ్యాచ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే మళ్లీ వర్షం కురవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వర్షం తీవ్రత పెరగడంతో క్యూరేటర్లు అప్రమత్తమై పిచ్‌తో పాటు మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. దీంతో టాస్‌ ప్రక్రియ ఆలస్యమైంది. వర్షం తగ్గి మైదానం ఆటకు అనుకూలంగా మారిన తర్వాతే అంపైర్లు తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. మ్యాచ్‌ నిర్వహణకు వాతావరణం సహకరిస్తుందా? ఓవర్లను కుదించి అయినా ఆట సాధ్యమవుతుందా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. నిర్ణయాత్మక పోరులో విజయం సాధించాలన్న ఇరు జట్ల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లడంతో క్రికెట్‌ అభిమానులు నిరీక్షణలో మునిగిపోయారు.

You may also like...