కాంగ్రెస్‌లో తిరుగుబాటు స్వరం..రేవంత్‌పై సుస్మిత ఫైర్!
- రూ.8,452 కోట్ల పీఎం కేర్స్..ఖర్చు మాత్రం రూ.87 లక్షలా? - August 19, 2026
- తెలంగాణ ఓపెన్ స్కూల్ SOCIETY (TOSS)అడ్మిషన్లు ప్రారంభం - August 19, 2026
- సంజీవయ్య పార్క్‌లో అద్భుత మల్టీమీడియా షో - August 19, 2026

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో చాలాకాలంగా రగులుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ రణరంగంగా మారుతున్నాయి. జిల్లాకో వర్గం.. నియోజకవర్గానికో ఆధిపత్య పోరు అన్న చందంగా పార్టీలో అసంతృప్తి అగ్గిరాజుకుంటోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య బహిరంగ విమర్శల నుంచి మొదలైన లుకలుకలు.. వనపర్తి, బాన్సువాడ, ఆదిలాబాద్, జడ్చర్ల, వరంగల్ వరకు విస్తరించిన పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్–కొత్త కాంగ్రెస్ మధ్య ఆధిపత్య పోరు మరింత ముదురుతున్నదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
తాజాగా పరకాల రాజకీయాలు ఈ అంతర్గత కలహాలకు మరింత పదును పెట్టాయి. పరకాల సభలో సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి రేవూరి ప్రకాశ్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునివ్వడం.. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్రంగా స్పందించడంతో కాంగ్రెస్‌లోని విభేదాలు గోడలు దాటి వీధికెక్కినట్లయ్యాయి.
“పరకాల నుంచి పోటీ చేసేది నేనే.. గెలిచేది నేనే” అంటూ సుస్మిత చేసిన ప్రకటన కాంగ్రెస్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై గెలుస్తానని ఆమె సవాల్ విసిరారు. అంతేకాదు, రేవూరితో రాజీనామా చేయించి ఇప్పుడే ఎన్నికలకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసరడం ద్వారా పరకాల పోరును మరింత ఘాటెక్కించారు.
కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపిక అధిష్ఠానం పరిధిలో ఉంటుందని చెబుతూనే.. ఒక నియోజకవర్గంలో మాత్రం సీఎం స్వయంగా అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేయడం ఏమిటని సుస్మిత ప్రశ్నించారు. “అధిష్ఠానం టికెట్లు ఇస్తే.. మీరు ఒక్కరే టికెట్లు నిర్ణయిస్తున్నట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?” అంటూ సీఎం తీరును నిలదీశారు. పరకాల తమ రాజకీయ ఇలాకా అని పేర్కొంటూ, అక్కడికి వచ్చి తమకు వ్యతిరేకంగా రాజకీయ ప్రచారం చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
రేవంత్‌రెడ్డి తన రాజకీయ ఎదుగుదలలో కొండా కుటుంబం సహకారం పొందారని, ఇప్పుడు అదే కుటుంబాన్ని విస్మరిస్తున్నారని సుస్మిత ఆరోపించారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు రేవంత్ రాజకీయ ప్రస్థానంలో సహకరించిన పాత కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు ప్రాధాన్యం తగ్గిందని ఆమె విమర్శించారు. పాత కాంగ్రెస్ నేతలు, కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే పార్టీలో అసంతృప్తి పెరుగుతోందని ఆమె వ్యాఖ్యలు చేశారు.
“అచ్చ కాంగ్రెస్–పచ్చ కాంగ్రెస్” అంటూ పార్టీలో జరుగుతున్న వర్గీకరణపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి. బీసీ ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం, ప్రాధాన్యం దక్కడం లేదని ఆమె ఆరోపించారు. కొండా కుటుంబాన్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందంటూ సీఎం నాయకత్వంపై నేరుగా విమర్శలు గుప్పించారు.
ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులపై కూడా సుస్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. భూవ్యవహారాలు, షెల్ కంపెనీలు, కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ పెద్దలపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇవి రాజకీయ ఆరోపణలేనని, వాటిపై సంబంధిత వ్యక్తుల నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ప్రస్తావిస్తూ కూడా సుస్మిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. “పొంగు ఎక్కువకాలం పొంగదు” అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో మరో అధికార కేంద్రంపై ఆమె చేసిన రాజకీయ విసురుగా చర్చకు దారితీశాయి. బీసీలను తక్కువగా చూస్తున్నారంటూ ఆమె చేసిన విమర్శలు కూడా పార్టీలో కొత్త చర్చకు తెరలేపాయి.
ఇక తన వ్యాఖ్యలకు సీఎం లేదా ఆయన వర్గం నుంచి కౌంటర్ వస్తే మరిన్ని విషయాలను బయటపెడతానని సుస్మిత హెచ్చరించడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ప్రెస్‌క్లబ్ వేదికగా ప్రభుత్వ పెద్దల వ్యవహారాలను బయటపెడతానని ఆమె చేసిన ప్రకటన కాంగ్రెస్ అంతర్గత రచ్చను బహిరంగ రాజకీయ యుద్ధంగా మార్చింది.
ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తమ స్వరాన్ని వినిపిస్తున్న నేపథ్యంలో పరకాల పరిణామం కాంగ్రెస్‌లోని అసంతృప్తికి మరో బహిరంగ రూపంగా మారింది. నాయకత్వంపై ప్రశ్నలు, టికెట్ల ఆధిపత్యం, పాత–కొత్త నేతల విభేదాలు, సామాజిక సమీకరణాలు ఒకదానితో ఒకటి ముడిపడుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌లో టికెట్ల కోసం ఇప్పటి నుంచే రాజకీయ కత్తులు దూస్తున్నాయన్న చర్చ మొదలైంది.
పరకాల వేదికగా మొదలైన ఈ మాటల యుద్ధం ఎక్కడివరకు వెళ్తుంది? కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకుని విభేదాలకు తెరదించుతుందా? లేక ఈ అంతర్గత అగ్గి మరిన్ని నియోజకవర్గాలకు వ్యాపిస్తుందా? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.
