దిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక భేటీ
- గడ్డం వెంకటస్వామి ఆశయాలకు ఘన నివాళి - October 5, 2026
- మహాలక్ష్మికి పెరుగుతున్న ఆదరణ..3 నెలల్లో 97.20 లక్షల అదనపు ప్రయాణాలు - October 5, 2026
- ఎన్నికల వ్యవస్థపై కాంగ్రెస్ మూడు డిమాండ్లు - October 5, 2026

దిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక భేటీ
జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ :దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ నేడు దిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం 4 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో జరిగే ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జీలు, పీసీసీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల జాతీయ అధ్యక్షులను ఆహ్వానించారు.
సమావేశంలో SIR అంశంపై కాంగ్రెస్ చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణ, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలు, ఇండియా కూటమితో సమన్వయం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష కూటమి అక్టోబర్ 2 నుంచి 8 వరకు జిల్లాస్థాయిలో ‘సేవ్ డెమోక్రసీ’ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే అక్టోబర్ 6న ప్రతిపక్ష ఎంపీలు దిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించినట్లు వెల్లడైంది.
SIR ప్రక్రియపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ల హక్కులు, ఓటర్ల జాబితాల పారదర్శకతపై స్పష్టత అవసరమని అవి కోరుతున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం ఓటర్ల జాబితాల సవరణ చట్టబద్ధమైన విధానాల ప్రకారమే జరుగుతోందని చెబుతోంది.
ఇదిలా ఉండగా, దిల్లీలో అక్టోబర్ 7న ఇండియా కూటమి పార్టీలు సంయుక్తంగా ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో నేటి కాంగ్రెస్ సమావేశంలో రాష్ట్రాల వారీగా నిరసన కార్యక్రమాల అమలు, పార్టీ శ్రేణుల సమీకరణ, కూటమి పార్టీలతో సమన్వయంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
