గోదావరి పుష్కరాలపై సర్కార్ సీరియస్
- చదువుతోనే తలరాత మారుతుంది - August 14, 2026
- రాజ్యాంగాన్ని గౌరవిద్దాం:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - August 14, 2026
- ప్రజావాణికి పకడ్బందీ కార్యాచరణ - August 14, 2026

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఘాట్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, రవాణా, వైద్యం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి డి. శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు. నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొత్తం 67 పుష్కర ఘాట్లను మూడు అంచెల్లో అభివృద్ధి చేయనున్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో సుమారు రూ.1,000 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి.
పుష్కరాల సమయంలో రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించనున్నారు. వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేక బారికేడ్లు, స్నానఘాట్లు ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేయనున్నారు. భక్తుల ఆరోగ్య భద్రత కోసం వైద్య శిబిరాలు, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. తాత్కాలిక బస్స్టేషన్లు, పార్కింగ్, ప్రయాణికుల వెయిటింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఘాట్లు, పరిసరాల్లో నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి గోదావరి జలాలను కాలుష్యానికి గురికాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
పుష్కరాల ఏర్పాట్ల పురోగతిని శాఖల వారీగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డు రూపొందించాలని శ్రీధర్‌బాబు ఆదేశించారు. పనుల్లో జాప్యం, నాణ్యత లోపాలకు తావులేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను స్పష్టం చేశారు. భద్రాచలం, ధర్మపురి వంటి ప్రసిద్ధ క్షేత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, ఆధ్యాత్మిక వాతావరణం కల్పిస్తే 2027 గోదావరి పుష్కరాలు తెలంగాణలో చిరస్మరణీయంగా నిలిచే అవకాశం ఉంది.

