ఏపీ మున్సిపల్‌ ఎన్నికలు.. ఉద్యోగులకు సెలవు!

జ్ఞాన తెలంగాణ, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ తేదీ మారడంతో ఉద్యోగులు, కార్మికుల సెలవు విషయంలో రాష్ట్ర కార్మిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లోని దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు నవంబర్‌ 1న వేతనంతో కూడిన సెలవు కల్పించాలని స్పష్టం చేసింది. తొలుత అక్టోబర్‌ 28న పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, ఎన్నికల తేదీని నవంబర్‌ 1కి మార్చడంతో గతంలో జారీ చేసిన సెలవు ఉత్తర్వుల్లోనూ సవరణలు చేపట్టింది.

రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది. ఏపీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం–1988లోని సెక్షన్‌ 31(2) నిబంధనల ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కార్మిక శాఖ కమిషనర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు.

గతంలో అక్టోబర్‌ 28న సెలవు ప్రకటిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ, నవంబర్‌ 1వ తేదీని వేతనంతో కూడిన సెలవు దినంగా పరిగణించాలని తాజా ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలని సంబంధిత జాయింట్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. గత ఉత్తర్వుల్లోని ఇతర సూచనలు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని అర్హులైన ఉద్యోగులు, కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు.

You may also like...