ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ.. బాలరాజ్ గౌడ్‌పై రౌడీషీట్!

ఘట్కేసర్, బ్యూరో: భూ వివాదాలు, నకిలీ పత్రాల వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలగోని బాలరాజ్ గౌడ్‌పై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. ఘట్కేసర్ ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయనపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు రౌడీషీట్ తెరిచినట్లు తెలుస్తోంది. భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నేపథ్యంలో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంతో పాటు ఘట్కేసర్, పోచారం పోలీస్‌స్టేషన్ల పరిధిలో భూ వివాదాలకు సంబంధించి ఆయనపై మొత్తం తొమ్మిది కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

ఇటీవల అన్నోజిగూడ పరిధిలోని సర్వే నంబర్ 93/ఏఏ భూ వివాదం ఈ వ్యవహారానికి కేంద్రబిందువుగా మారింది. ఈ వివాదంలో ఘట్కేసర్ ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు పత్రం సృష్టించినట్లు బాలరాజ్ గౌడ్‌పై ఆరోపణలు వచ్చాయి. అంతటితో ఆగకుండా సదరు పత్రాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి బాలరాజ్ గౌడ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.

భూ వివాదాలకు సంబంధించి వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆయన కార్యకలాపాలపై నిఘా పెంచినట్లు సమాచారం. రౌడీషీట్ తెరవడం ద్వారా భవిష్యత్తులో ఆయన కదలికలను పర్యవేక్షించేందుకు పోలీసులకు అవకాశం ఉంటుంది. అయితే ఈ వ్యవహారంపై పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

You may also like...