చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు!

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్ : ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్‌కు సంబంధించిన కేసును విచారించిన న్యాయస్థానం బుధవారం ఆయనకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. మద్దిరాలపాడుకు చెందిన జెట్టి వెంకటేశ్వరరావుకు చెల్లించాల్సిన బాకీ మొత్తానికి సంబంధించి బండ్ల గణేశ్ చెక్ ఇచ్చినట్లు సమాచారం. అయితే సదరు చెక్ బ్యాంకులో చెల్లింపునకు సమర్పించగా బౌన్స్ కావడంతో బాధితుడు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఒంగోలు కోర్టు తాజాగా తీర్పు ప్రకటించింది.

గతంలోనూ బండ్ల గణేశ్ బ్యాంకు రుణాలు, ఆస్తుల వేలానికి సంబంధించిన వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లో బ్యాంకు రుణాల చెల్లింపులు, ఆస్తుల వేలానికి సంబంధించి కూడా కేసులు ఉన్నట్లు సమాచారం. తాజాగా చెక్ బౌన్స్ కేసులో కోర్టు విధించిన శిక్ష, జరిమానాతో ఆయన మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ తీర్పు సినీ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

You may also like...