విశాఖలో సముద్ర రక్షణకు మరింత బలం

జ్ఞాన తెలంగాణ,నేషనల్ బ్యూరో : రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫ్లీట్ సపోర్ట్ షిప్-1 (ఎఫ్ఎస్ఎస్-1)ను లాంఛనంగా జలప్రవేశం చేయించారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, రక్షణ ఉత్పత్తి కార్యదర్శి సంజీవ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. భారత నౌకాదళం కోసం హెచ్ఎస్ఎల్ నిర్మిస్తున్న ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లలో ఇది తొలి నౌక. సుమారు 43,500 టన్నుల బరువుతో రూపొందుతున్న ఈ భారీ నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుదీర్ఘకాలం నౌకాదళ కార్యకలాపాలకు కీలకంగా నిలవనున్నాయి. యుద్ధనౌకలు సముద్రంలోనే ఉన్న సమయంలో వాటికి ఇంధనం, ఆహారం, ఇతర అవసరమైన సామగ్రిని అందించేందుకు ఇవి ఉపయోగపడతాయి. కేవలం 18 నెలల్లోనే స్టీల్ కటింగ్ దశ నుంచి జలప్రవేశం వరకు చేరుకోవడం హెచ్ఎస్ఎల్ నిర్మాణ సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఇదే కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్ ఐదో ఫ్లీట్ సపోర్ట్ షిప్ నిర్మాణానికి కీల్ లేయింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆధునికీకరించిన స్లిప్‌వే-4తో పాటు 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్‌ను ప్రారంభించారు. ఈ సౌకర్యాలతో హెచ్ఎస్ఎల్‌లో 45,000 డీడబ్ల్యూటీ వరకు బరువున్న భారీ నౌకలను నిర్మించే సామర్థ్యం మరింత పెరగనుంది. మరోవైపు ఒడిశాలోని కోరాపుట్‌లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కేంద్రంలో 2,000వ ఏరో-ఇంజిన్ మైలురాయి కార్యక్రమం జరగనుంది. సుమారు రూ.218 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ‘శక్తి’ ఇంజిన్ల రెండో ఉత్పత్తి లైన్ ద్వారా ధ్రువ్, ప్రచండ్ వంటి స్వదేశీ హెలికాప్టర్ల తయారీకి అవసరమైన ఇంజిన్ల ఉత్పత్తి పెరగనుంది. రక్షణ పరికరాల కోసం విదేశాలపై ఆధారపడే స్థితి నుంచి స్వదేశీ డిజైన్, అభివృద్ధి, తయారీ సామర్థ్యాల దిశగా భారత్ దూసుకెళ్తున్నదానికి ఈ కార్యక్రమాలు ప్రతీకగా నిలుస్తున్నాయి.

You may also like...