టొరంటో వర్సిటీ భారీ స్కాలర్షిప్
- సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు - October 6, 2026
- టొరంటో వర్సిటీ భారీ స్కాలర్షిప్ - October 6, 2026
- విశాఖలో సముద్ర రక్షణకు మరింత బలం - October 6, 2026

విదేశాల్లో పీహెచ్డీ చేయాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయం భారీ అవకాశాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనా ప్రతిభను ఆకర్షించే లక్ష్యంతో ‘ప్రెసిడెంట్స్ ఇంపాక్ట్ స్కాలర్షిప్స్’ పేరుతో 100 మిలియన్ కెనడియన్ డాలర్ల (దాదాపు రూ.956 కోట్లు) నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎంపికైన ఒక్కో పీహెచ్డీ విద్యార్థికి ఏడాదికి 80 వేల కెనడియన్ డాలర్లు, నాలుగేళ్లలో మొత్తం 3.2 లక్షల కెనడియన్ డాలర్లు అందనున్నాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.3.08 కోట్లకు సమానం. విద్యార్థులు ఇద్దరు అధ్యాపకుల పర్యవేక్షణలో పరిశోధనలు చేపట్టడంతోపాటు విభిన్న రంగాలను అనుసంధానించే పరిశోధనలకు అవకాశం కల్పించనున్నారు. సంక్లిష్టమైన ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు కనుగొనే పరిశోధనలను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఈ కార్యక్రమానికి కెనడాకు చెందిన ఓ ఫ్యామిలీ ఫౌండేషన్ 50 మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వగా, విశ్వవిద్యాలయం మరో 50 మిలియన్ డాలర్లు సమకూర్చింది. 2027 సెప్టెంబర్ నుంచి ప్రతి ఏడాది 12 లేదా 13 మంది కొత్త విద్యార్థులను ఎంపిక చేసి నాలుగేళ్లపాటు స్కాలర్షిప్ అందించనున్నారు. నాలుగో ఏడాదికి మొత్తం 50 మంది విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి రానున్నారు. అనంతరం కూడా 50 మంది స్కాలర్లకు నిరంతరంగా నిధులు అందేలా కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు.
