ఉద్యోగులు,పింఛన్‌దారులకు నగదు రహిత వైద్యం


జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ (ఈహెచ్‌ఎస్) అమలు వేగం పుంజుకుంది. ఈ పథకాన్ని నిర్వహిస్తున్న ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 919 ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. జూలై 17న పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 15,395 చికిత్సలకు సంబంధించి రూ.104.63 కోట్ల విలువైన ముందస్తు అనుమతులు మంజూరు చేశారు. వీటిలో 778 ప్రైవేట్, 141 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి.

సెప్టెంబర్ 1 నుంచి పోలీసు శాఖను కూడా ఈ పథకంలోకి తీసుకురావడంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగింది. ఉద్యోగులు, పింఛన్‌దారుల నుంచి నెలకు సుమారు రూ.44 కోట్ల చందాలు సమకూరుతుండగా, ప్రభుత్వం కూడా మరో రూ.44 కోట్లను తన వాటాగా అందిస్తోంది. దీంతో ప్రతి నెలా ఈహెచ్‌ఎస్‌ నిర్వహణకు మొత్తం రూ.88 కోట్ల నిధులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ పథకానికి ఏడాదికి సుమారు రూ.1,056 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా వేశారు.

ఈహెచ్‌ఎస్‌ ద్వారా ఇన్‌పేషెంట్‌తో పాటు అవుట్‌పేషెంట్ సేవలను కూడా నగదు రహితంగా అందిస్తున్నారు. వెల్‌నెస్ సెంటర్లలో వైద్యుల సంప్రదింపులు, రోగ నిర్ధారణ పరీక్షలు, మందుల పంపిణీ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 12 జిల్లాల్లో 12 వెల్‌నెస్ సెంటర్లు పనిచేస్తుండగా, మరో 25 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో 21 కేంద్రాలను వివిధ జిల్లాల్లో, మరో నాలుగు కేంద్రాలను హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో ఏర్పాటు చేయనున్నారు.

ఇన్‌పేషెంట్ వైద్య సేవల కోసం మొత్తం 1,816 సీజీహెచ్‌ఎస్ చికిత్స ప్యాకేజీలు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా హెల్త్ కార్డు ఇంకా జారీ కాలేదనే కారణంతో అర్హులైన ఉద్యోగులు, పింఛన్‌దారులకు వైద్య సేవలను నిరాకరించకూడదని అధికారులు స్పష్టం చేశారు. లబ్ధిదారులు తమ గుర్తింపు సంఖ్యను ఉపయోగించి చికిత్స పొందే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 28 నాటికి 12,56,962 మంది లబ్ధిదారులకు హెల్త్ కార్డులు అందుబాటులోకి రాగా, 7,56,210 మంది వాటిని డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఇదిలా ఉండగా కొత్త ఈహెచ్‌ఎస్‌ అమల్లోకి వచ్చిన తర్వాత పాత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కు సంబంధించిన బకాయిల చెల్లింపులపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. పాత పథకానికి సంబంధించి ఇటీవల రూ.70 కోట్ల బకాయిలను విడుదల చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇంకా రూ.100.52 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.23.85 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.76.67 కోట్లు చెల్లించాల్సి ఉంది. లబ్ధిదారులకు వైద్య సేవలు పొందే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా 30 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.

You may also like...