హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్: పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఫీజు బకాయిల సమస్యను పరిష్కరించాలంటూ నిరసనకారులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. విద్యార్థులతో కలిసి బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య లక్డీకపూల్‌లోని కార్యాలయ ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.

ఆందోళనకారులను పోలీసులు నిలువరించడంతో పోలీసులకు, బీసీ విద్యార్థి నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫీజు బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల ఆందోళనతో హైదరాబాద్‌ కలెక్టరేట్‌, లక్డీకపూల్‌ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫీజు బకాయిల సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టాలని విద్యార్థి నాయకులు కోరారు

You may also like...