ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్‌ పిటిషన్





జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ: 2015 నాటి ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసులో తనను ఇంప్లీడ్‌ చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. తన వాదనలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని, కేసుకు సంబంధించిన అంశాలపై అదనపు వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కేసులో స్టీఫెన్‌సన్‌ వాదనలు వినడం న్యాయపరమైన ప్రక్రియలో ముఖ్యమని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.

2015లో తెలంగాణ శాసనమండలి ఎన్నికల సమయంలో ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని కోరుతూ స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వడానికి ప్రయత్నించారనే ఆరోపణలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ ట్రాప్‌ నిర్వహించి రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరిని అరెస్టు చేసింది. నగదు, ఆడియో-వీడియో రికార్డులు కేసులో కీలక ఆధారాలుగా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.

ప్రస్తుతం ఈ కేసులో రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా, స్టీఫెన్‌సన్‌ తాజాగా ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్లపై కూడా సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

స్టీఫెన్‌సన్‌ తనను ప్రధాన ఫిర్యాదుదారుగా పరిగణించి, తన వాదనలను కూడా వినాలని కోరుతున్నారు. ఆయన దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను ధర్మాసనం పరిగణనలోకి తీసుకోవడంతో తదుపరి విచారణకు మార్గం సుగమమైంది. దీంతో ఓటుకు నోటు కేసు మరోసారి న్యాయ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే కేసులో తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. సుప్రీంకోర్టు తదుపరి విచారణలో ఇంప్లీడ్‌ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది

You may also like...