జనగామలో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన సదస్సు

జనగామలో పీఎం సూర్య ఘర్–ముఫ్త్ బిజిలి యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. జనగామ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి సూపరింటెండింగ్ ఇంజినీర్ సంపత్‌రెడ్డి అధ్యక్షత వహించగా, మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వం అందించే సబ్సిడీ, దరఖాస్తు విధానం, బ్యాంకు రుణాలు, నెట్ మీటరింగ్‌పై బ్యాంకు, సోలార్ సంస్థల ప్రతినిధులు ప్రజలకు వివరించారు. సోలార్ ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవారికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు. సౌర విద్యుత్ వినియోగంతో విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
