మూఢనమ్మకంతో సవతి సోదరుడి హత్య.. కేసును ఛేదించిన నర్మెట సర్కిల్ పోలీసులు

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలో జరిగిన హత్య కేసును నర్మెట సర్కిల్ పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.గ్రామానికి చెందిన మిన్నలాపురం సిద్ధయ్య (60) ఈ నెల 23వ తేదీ తెల్లవారుజామున తన వ్యవసాయ భూమి వద్ద తలకు తీవ్ర గాయాలతో కనిపించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల అనుమానాల మేరకు బచ్చన్నపేట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.సుమారు 30 మంది వ్యక్తులను విచారించడంతో పాటు, 200 మంది సెల్‌ఫోన్ నంబర్ల కాల్ డేటా, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి సాంకేతిక, క్షేత్రస్థాయి ఆధారాలతో నిందితుడిని గుర్తించారు.విచారణలో మృతుడి సవతి తల్లి కుమారుడైన మిన్నలాపురం శ్రీనివాస్, తన భార్య, పిల్లల అనారోగ్యాలకు, కుటుంబంలో జరిగిన మరణాలకు సిద్ధయ్య చేతబడి చేయడమే కారణమని మూఢనమ్మకంతో భావించినట్లు వెల్లడైంది. గత ఫిబ్రవరి 3న సిద్ధయ్యపై హత్యాయత్నం చేసినప్పటికీ, అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అయినా నిందితుడు మరోసారి హత్యకు పథకం రచించి, ఈ నెల 23న తెల్లవారుజామున పాలు పితకడానికి వచ్చిన సిద్ధయ్యపై వెనుక నుంచి కత్తితో తలపై దాడి చేసి పరారయ్యాడు.పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన స్కూటీతో పాటు కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ఆదేశాల మేరకు, వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో, జనగామ ఏసీపీ భీమశర్మ ఆధ్వర్యంలో నర్మెట సీఐ పెండ్యాల దేవేందర్, బచ్చన్నపేట ఎస్‌ఐ శ్రీకాంత్, పోలీసు సిబ్బంది ఈ కేసును ఛేదించారు. దర్యాప్తు బృందాన్ని సీపీ అభినందించారు. సాంకేతిక సహకారం అందించిన ఐటీ కోర్ ఏవో సల్మాన్‌ను కూడా ప్రత్యేకంగా అభినందించారు.మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి: ఏసీపీ భీమశర్మ.ప్రజలు చేతబడి,మంత్రతంత్రాలపై అంధవిశ్వాసాలకు దూరంగా ఉండాలని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఏసీపీ భీమశర్మ సూచించారు. అనారోగ్య సమస్యలకు అర్హత కలిగిన వైద్యులను సంప్రదించాలని,మూఢనమ్మకాలతో ఇతరులపై అనుమానాలు పెంచుకుని హింసకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

You may also like...