వృద్ధాప్యంలో గుండె లయపై నిర్లక్ష్యం వద్దు!

వయసు పెరుగుతోందని శరీరంలో వచ్చే ప్రతి మార్పును సహజ పరిణామంగా భావించడం ప్రాణాంతక నిర్లక్ష్యానికి దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుండె కొట్టుకునే లయలో ఏర్పడే అసమానతలను తేలికగా తీసుకోవడం తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని స్పష్టం చేస్తున్నారు. వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే కర్ణిక దడ (ఏట్రియల్ ఫిబ్రిలేషన్‌–ఏఎఫ్‌ఐబీ) గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా పక్షవాతం, గుండె వైఫల్యం వంటి ప్రాణాంతక పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. భారత్‌లో దాదాపు 79 లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే వయసు పెరిగిన ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి వస్తుందని భావించరాదని, ప్రమాద కారకాలపై అవగాహన పెంచుకోవడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా గుండె క్రమబద్ధమైన లయతో కొట్టుకుంటూ శరీరంలోని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. విశ్రాంతి సమయంలో గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవడం సాధారణం. అయితే కర్ణిక దడ సమస్యలో గుండెలోని పై గదులైన కర్ణికల్లో విద్యుత్ సంకేతాలు అస్తవ్యస్తంగా ఉత్పన్నమవుతాయి. ఫలితంగా గుండె కొట్టుకునే వేగం, లయ అదుపుతప్పుతాయి. ఈ పరిస్థితిలో కర్ణికల్లో నిమిషానికి 450 నుంచి 600 వరకు విద్యుత్ ప్రేరణలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ గుండె కండరాలు గట్టిపడటం, కర్ణికలు సాగి పెద్దవడం, మచ్చ కణజాలం పేరుకుపోవడం వంటి మార్పులు గుండె విద్యుత్ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీంతో అసాధారణ గుండె లయకు అవకాశం పెరుగుతుంది. అంచనాల ప్రకారం 60 ఏళ్ల వయసులో సుమారు 3 నుంచి 4 శాతం మందికి ఈ సమస్య ఉండే అవకాశం ఉండగా, 80 ఏళ్ల వయసులో ఈ సంఖ్య సుమారు 8 శాతానికి చేరవచ్చు.

గుండె వేగంగా కొట్టుకోవడం, నీరసం, తీవ్ర అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడిచేటప్పుడు తూలుతున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే కొందరిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే ఈ వ్యాధి కొనసాగుతుంది. ఇదే అత్యంత ఆందోళనకరమైన అంశం. ముఖ్యంగా వృద్ధుల్లో అలసట, ఆయాసాన్ని వృద్ధాప్య సహజ లక్షణాలుగా పరిగణించి వైద్య పరీక్షలను వాయిదా వేయడం ప్రమాదకరం. సాధారణ గుండె లయ ఉన్నవారితో పోలిస్తే కర్ణిక దడ బాధితులకు పక్షవాతం వచ్చే ప్రమాదం మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె పై గదుల్లో రక్తం నిలిచిపోయి గడ్డలు ఏర్పడితే, అవి రక్తప్రవాహం ద్వారా మెదడుకు చేరి పక్షవాతానికి కారణమయ్యే అవకాశం ఉంది.

మధుమేహం, అధిక రక్తపోటు, గుండె ధమనుల వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, స్లీప్ అప్నియా వంటి పరిస్థితులు ఈ ముప్పును మరింత పెంచుతాయి. అధికంగా మద్యం సేవించడం, పొగతాగడం, పొగాకు వినియోగం కూడా గుండె లయను దెబ్బతీసే ప్రమాద కారకాలుగా నిలుస్తాయి. కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అందువల్ల ఆరోగ్యంపై నిర్లక్ష్యం ప్రదర్శించకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం.

గుండె లయలో అసాధారణ మార్పులు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించి ఎలక్ట్రోకార్డియోగ్రామ్‌ (ఈసీజీ) పరీక్ష చేయించుకోవాలి. అవసరాన్ని బట్టి హోల్టర్ మానిటర్ లేదా లూప్ రికార్డర్ ద్వారా గుండె లయను ఎక్కువకాలం పర్యవేక్షిస్తారు. ఎంపిక చేసిన రోగుల్లో అమర్చే లూప్ రికార్డర్‌తో మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు గుండె లయను పరిశీలించే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా సాధన, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడం గుండె ఆరోగ్యానికి దోహదపడతాయి. గుండె దడతో పాటు ఛాతినొప్పి, తీవ్రమైన శ్వాస ఇబ్బంది, మూర్ఛ లేదా ముఖం వాలిపోవడం, మాట తడబడటం, ఒకవైపు చేయి లేదా కాలు బలహీనపడటం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే అత్యవసర వైద్యసహాయం పొందాలి. వయసును సాకుగా చూపి గుండె హెచ్చరికలను విస్మరిస్తే మూల్యం ప్రాణాల రూపంలో చెల్లించాల్సి రావచ్చు. ముందస్తు గుర్తింపు, సరైన వైద్యం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలే గుండెను కాపాడే కీలక మార్గాలు.

You may also like...