క్వారీలకు అండగా.. రూ.2 లక్షలతో అడ్డంగా బుక్కైన సర్పంచ్!
- చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు! - November 18, 2026
- సీఎస్‌ను కలిసిన ఆర్టీసీ ఎండీ, హైదరాబాద్ సీపీ - November 18, 2026
- ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ.. బాలరాజ్ గౌడ్‌పై రౌడీషీట్! - November 18, 2026

మహబూబాబాద్ : వినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో ప్రజాప్రతినిధి చిక్కాడు. గ్రానైట్ క్వారీల కార్యకలాపాలకు సహకరించేందుకు భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసిన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం మోదుగడ్డ తండా సర్పంచ్ ధరావత్ వీరును వరంగల్ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఖమ్మంలోని ఫిర్యాదుదారుడి కార్యాలయంలో రూ.2 లక్షల లంచం స్వీకరిస్తుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సర్పంచ్ ధరావత్ వీరు తొలుత రూ.30 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం బేరసారాల తర్వాత రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. M/s. శారద స్టోనెక్స్, M/s. ప్రీమియర్ గ్రానైట్స్, M/s. రాశి గ్రానైట్స్ క్వారీల కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటం, గ్రానైట్ వ్యాపారం సజావుగా సాగేందుకు సహకరించడం కోసం ఈ మొత్తం డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.
ఒప్పందంలో భాగంగా మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా వరంగల్ ఏసీబీ బృందం పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించింది. లంచం సొమ్మును స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుంది. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తి వ్యాపార కార్యకలాపాలకు సహకారం పేరుతో లక్షల రూపాయలు డిమాండ్ చేయడం విమర్శలకు తావిస్తోంది.
నిందితుడిని అరెస్టు చేసి వరంగల్‌లోని ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది. అవినీతి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీబీ స్పష్టం చేసింది.

