సొంత పార్టీ సర్పంచ్‌కే గుర్తింపు కరువా?

కట్టంగూర్ పింఛన్ల పంపిణీలో వివాదం అధికార పార్టీ కి చెందిన కట్టంగూర్ సర్పంచ్‌ శ్యామలకు చేదు అనుభవం ఉప సర్పంచ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై చర్చ

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 17: అధికార పార్టీకి చెందిన మహిళా సర్పంచ్‌కే ప్రభుత్వ కార్యక్రమంలో తగిన ప్రాధాన్యత దక్కకపోవడం కట్టంగూర్ లో చర్చనీయాంశంగా మారింది. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ముందుగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై కొన్ని పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసి మిగతా వాటిని స అధికారులు ప్రజాప్రతినిధులు సజావుగా పంపిణీ చేయాలని ఆదేశించి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ ముక్కాముల శ్యామలను పక్కనపెట్టి ఉప సర్పంచ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయడం వివాదానికి కారణమైంది. నిబంధనల ప్రకారం వివరించాల్సిన పంచాయతీ కార్యదర్శి సైతం ఉపసర్పంచ్ సహకరించడం పై సర్పంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ను పక్కన పెట్టారంటూ సర్పంచ్ శ్యామల ఆరోపించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి జోక్యం చేసుకుని సర్పంచ్ శ్యామల, ఉప సర్పంచ్ తో పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేయించంతో వివాదం సద్దుమణిగింది. మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెబుతున్న తరుణంలో, అందులోనూ అధికార పార్టీకి చెందిన మహిళా సర్పంచ్‌కే ఇలాంటి పరిస్థితి ఎదురవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. కార్యక్రమ నిర్వహణలో ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, పంచాయతీ కార్యదర్శి వ్యవహరించిన తీరుపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

You may also like...