హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.

ప్రజల గొంతును అణచివేయడం

ప్రజాస్వామ్యానికి విరుద్ధం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 8: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఏడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం నకిరేకల్‌లో బీఆర్‌ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో 420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిలో అనేక హామీలను ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. రైతులకు రైతుభరోసా, కౌలు రైతులకు ఆర్థిక సాయం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు విద్యానిధి, పెండింగ్ ఫీజు బకాయిల చెల్లింపు, పెన్షన్లు, దళితులు, దివ్యాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బీఆర్‌ఎస్‌ పార్టీగా తమ బాధ్యత అని అన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించినందుకు కేసులు పెట్టడం, నిరసనలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల కూడా అనుచితంగా వ్యవహరించే స్థాయికి ప్రభుత్వం దిగజారడం దురదృష్టకరమని అన్నారు. డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రజలకు ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు, తమ హక్కుల కోసం పోరాడే స్వేచ్ఛను కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ఆ రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణలో ప్రజల గొంతును అణచివేసే చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రజల హక్కులను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మారం వెంకట్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు మాద ధనలక్ష్మి, నగేష్ గౌడ్, తరాల బలరాములు, గుండెగోని జంగయ్య, నోముల కేశవరాజు, పేర్ల కృష్ణ కాంత్, కట్టంగూర్ మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1000338310.jpg1000338311.jpg

You may also like...