ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్స
- డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి - September 7, 2026
- ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్స - September 7, 2026
- అడుగడుగునా గుంతలు.. రాకపోకలకు అవస్థలు.. 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకు మరమ్మతులు కరువు శిథిలమైన కురుమర్తి రోడ్డు… - September 7, 2026
ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్స
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 6 : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వానరానికి ఓ గోపాలమిత్రుడు మానవత్వంతో అండగా నిలిచారు. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ పరిధిలోని చెర్వుఅన్నారం అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం డీసీఎం వాహనం ఢీకొనడంతో ఓ వానరం తీవ్రంగా గాయపడింది. కదలలేని స్థితిలో రోడ్డుపక్కన పడి ఉన్న వానరాన్ని చూసిన వారు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో అటుగా కృత్రిమ గర్భధారణ కోసం వెళ్తున్న గోపాలమిత్రుడు చెరుకు శ్రీనివాస్ గాయపడిన వానరాన్ని గమనించారు. వెంటనే స్పందించిన ఆయన వైద్యుడికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. డాక్టర్ సలహా మేరకు వానరానికి ప్రథమ చికిత్స అందించి, అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వానరం కోలుకునే సంకేతాలు కనిపించడంతో అక్కడున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జంతువైనా.. ప్రాణమే కదా.. అన్న మానవత్వంతో గాయపడిన వానరానికి సకాలంలో చికిత్స అందించిన శ్రీనివాస్‌ను అక్కడున్న ప్రజలు అభినందించారు. మూగజీవి ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపిన చొరవ అందరి ప్రశంసలు అందుకుంది.
