గ్రామీణ తాగునీటికి భారీ అడుగు

జ్ఞాన తెలంగాణ,ప్రొద్దుటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటిని అందించడమే లక్ష్యంగా చేపట్టిన ‘జల్‌ జీవన్‌ మిషన్‌ 2.0–అమరజీవి జలధార’ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ లాంఛనంగా శ్రీకారం చుట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో రూ.30,156 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద సుమారు 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు కొత్తగా కుళాయి నీటి కనెక్షన్లు అందించనున్నారు.

ఇందులో భాగంగా గండికోట రిజర్వాయర్‌ నుంచి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే సమగ్ర పథకానికి కూడా పనులు ప్రారంభించారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించడంతో పాటు ప్రజలకు ఇంటివద్దకే సురక్షితమైన తాగునీటిని అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. పనుల ప్రారంభానికి గుర్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మొత్తం 13 శిలాఫలకాలను ఆవిష్కరించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను కూడా వారు ఆవిష్కరించారు.

అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ప్రత్యేక ర్యాంపుపై కలిసి నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వసతులను మెరుగుపరచడంతోపాటు భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

You may also like...