ప్రేమ వ్యవహారంలో ఇద్దరి మృతి

జ్ఞాన తెలంగాణ, విజయవాడ ప్రతినిధి: విజయవాడ న్యూ రాజరాజేశ్వరీపేటలో ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. మహాలక్ష్మి (19), చిన్నారావు (22) మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నారావు పెయింటింగ్‌, ఫ్లవర్‌ డెకరేషన్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం విజయవాడలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నివాస సముదాయంలో నాయనమ్మతో కలిసి ఉంటున్న మహాలక్ష్మితో అతడికి పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ కుటుంబాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా, మహాలక్ష్మి జోలికి వెళ్లనని చిన్నారావు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో శనివారం ఉదయం మహాలక్ష్మి ఇంటికి వెళ్లిన చిన్నారావు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఆమెపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఘటన అనంతరం చిన్నారావు సమీపంలోని భవనంపైకి వెళ్లి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గతంలో ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. హత్య, ఆత్మహత్య ఘటనలపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబాల అభ్యంతరాలే ఘటనకు కారణమా అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

You may also like...