డీఎల్‌ స్లాట్‌కు కొత్త నిబంధన

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌ ప్రతినిధి: డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలనుకునే వారికి తెలంగాణ రవాణా శాఖ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై డీఎల్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవాలంటే ముందుగా రెండున్నర గంటల రోడ్డు భద్రతా వీడియో కోర్సును పూర్తి చేయడం తప్పనిసరి. గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలో ఈ విధానాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులకు ట్రాఫిక్‌, రహదారి భద్రతా నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కోర్సును రూపొందించారు. మొత్తం 64 రకాల రహదారి భద్రతా నియమాలు, ప్రాక్టికల్‌ డ్రైవింగ్‌ అంశాలను ఇందులో పొందుపరిచారు. 25 నిమిషాల చొప్పున ఆరు మాడ్యూళ్లుగా రూపొందించిన వీడియోలను తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు వీడియోను కేవలం ప్రారంభించి పక్కన పెట్టకుండా పూర్తిగా వీక్షించేలా ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. వీడియో చూస్తున్న సమయంలో అభ్యర్థి ముఖం కెమెరాకు స్పష్టంగా కనిపించాలి. అయితే కోర్సును ఒకేసారి కాకుండా తమకు అనుకూలమైన సమయంలో విడతల వారీగా పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు. మొత్తం కోర్సు పూర్తయిన తర్వాతే డీఎల్‌ స్లాట్‌ బుకింగ్‌కు సిస్టమ్‌ అనుమతిస్తుంది. ఈ నిబంధన కొత్తగా ఎల్‌ఎల్‌ఆర్‌ తీసుకున్న వారితో పాటు గతంలో లెర్నర్‌ లైసెన్స్‌ పొందిన వారికి కూడా వర్తిస్తుందని రవాణా శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. కూకట్‌పల్లి ఆర్టీవో కార్యాలయంలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో తొలి దశలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందే ప్రతి అభ్యర్థికి రహదారి భద్రతపై అవగాహన కల్పించి, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశమని రవాణా శాఖ పేర్కొంది.

You may also like...