దొంగిలించిన 32 పట్టుచీరలు.. భయంతో కొరియర్‌లో తిరిగి పంపిన దొంగలు
- రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్ ఆరు నెలలు వాడని కార్డులు బంద్.. - October 4, 2026
- ప్రేమ వ్యవహారంలో ఇద్దరి మృతి - October 4, 2026
- జుట్టు రాలడానికి ఒత్తిడే కారణం! - October 4, 2026

జ్ఞాన తెలంగాణ,తమిళనాడు ప్రతినిధి: తమిళనాడులో వింత చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. చీరలు కొనుగోలు చేసే కస్టమర్లుగా దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు ఖరీదైన పట్టుచీరలను అపహరించగా, ఈ ఘటనపై మీడియాలో వార్తలు రావడంతో భయపడి చోరీ చేసిన సొత్తును కొరియర్ ద్వారా తిరిగి యజమానికి పంపించారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలోని సెవూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సెవూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ వీధిలో కుమార్ అనే వ్యాపారి పట్టుచీరల దుకాణం నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన లగ్జరీ కారులో నలుగురు మహిళలు సహా ఆరుగురు వ్యక్తులు దుకాణానికి వచ్చారు. ఖరీదైన పట్టుచీరలను పరిశీలించిన వారు కొన్ని తక్కువ ధర చీరలను కొనుగోలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెండు రోజుల అనంతరం దుకాణంలో ఖరీదైన చీరలు కనిపించకపోవడంతో కుమార్‌కు అనుమానం వచ్చింది. వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, కస్టమర్ల ముసుగులో వచ్చిన వారే చీరలను అపహరించినట్లు గుర్తించారు. దీంతో ఆయన ఆరణి తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే సమయంలో ఘటనపై స్థానిక పత్రికలు, టీవీ ఛానళ్లలో వరుస కథనాలు ప్రసారం కావడంతో నిందితులు భయపడినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులకే చోరీకి గురైన 32 పట్టుచీరలు కొరియర్ పార్శిల్ ద్వారా కుమార్ దుకాణ చిరునామాకు చేరాయి. దీంతో ఆశ్చర్యానికి గురైన వ్యాపారి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం కొరియర్ పార్శిల్ ఎక్కడి నుంచి పంపించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, కొరియర్ వివరాలు, వాహనం రిజిస్ట్రేషన్ తదితర ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. విచారణ పూర్తయితే ఈ వింత చోరీ వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
