86 బస్టాండ్లకు ఆధునిక హంగులు!
- ఓయూకు వెయ్యి కోట్ల హామీ ఏమైంది?.. - November 10, 2026
- పోలీసుల పనితీరే ప్రతిష్ఠ! - November 10, 2026
- నిశ్శబ్దంగా విస్తరిస్తున్న మధుమేహం! - November 10, 2026

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి:
ప్రజా రవాణా వ్యవస్థను ఆధునికీకరించి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే 86 ప్రధాన బస్స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో మోడల్ బస్స్టేషన్లుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రారంభించింది. రోజుకు 5 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండ్లకు ఈ ప్రణాళికలో ప్రాధాన్యం కల్పించనున్నారు.
ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి అయోమయానికి గురికాకుండా డిజిటల్ టైమ్‌టేబుల్ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. బస్సుల రాకపోకల సమయాలు, వెళ్లే మార్గాలు, ఇతర వివరాలను సులభంగా తెలుసుకునేలా సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే పబ్లిక్ అడ్రసింగ్ వ్యవస్థలు, ప్రత్యేక విచారణ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని తక్షణమే అందించనున్నారు.
మరోవైపు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఎంపిక చేసిన అన్ని బస్స్టేషన్లలో సీసీ కెమెరాలను విస్తృతంగా ఏర్పాటు చేయనున్నారు. వీటిని ప్రాంతీయ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయాలతో అనుసంధానించి బస్టాండ్లలో జరిగే కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టనున్నారు.
బస్టాండ్లలో మౌలిక సదుపాయాల లోపాలు, సమాచార గందరగోళం, భద్రతాపరమైన సమస్యలకు పరిష్కారం చూపడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం. అయితే ఆధునిక సదుపాయాల ఏర్పాటు కాగితాలకే పరిమితం కాకుండా వాటి నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ కూడా సమర్థవంతంగా కొనసాగాలి. అప్పుడే ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయి.
