2006 మలేషియన్‌ ఇంజనీర్‌ మృతి కేసు.. జ్ఞానేశ్‌ కుమార్‌పై తాజా విచారణ

జ్ఞాన తెలంగాణ,తిరువనంతపురం ప్రతినిధి: ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌కు సంబంధించిన 2006 నాటి కేసులో కేరళ ప్రభుత్వం తాజా విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. కేరళ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (పీడబ్ల్యూడీ) సెక్రటరీగా ఆయన పనిచేసిన సమయంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్న అంశాలపై ఈ విచారణ జరగనుంది. కేరళ హోంమంత్రి రమేశ్‌ చెన్నితల, కాంగ్రెస్‌ నేత మలయింకీళ్లు వేణుగోపాల్‌ సమర్పించిన పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం ఈ చర్యలకు ఆదేశించినట్లు సమాచారం. 2006లో కేరళ స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌ (కేఎస్‌టీపీ) కింద ఎంసీ రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగమైన పాటి-బెల్‌ కన్సార్టియం తరఫున పనిచేసిన మలేషియన్‌ సివిల్‌ ఇంజనీర్‌ లీ సీ బీన్‌ కౌలాలంపూర్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన సూసైడ్‌ నోట్‌లో జ్ఞానేశ్‌ కుమార్‌ పేరు ప్రస్తావనకు వచ్చిందన్న ఆరోపణలు అప్పట్లో వెలువడ్డాయి. ఈ కేసుపై జరిగిన ప్రాథమిక విజిలెన్స్‌ విచారణ బాహ్య ఒత్తిళ్ల కారణంగా ప్రభావితమైందని వేణుగోపాల్‌ తన పిటిషన్‌లో ఆరోపించారు. దీంతో నాటి విచారణకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ సమర్పించాలని విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌ బ్యూరోను హోంమంత్రి ఆదేశించినట్లు సమాచారం. అప్పటి దర్యాప్తు విధానం, రికార్డులు, ఆరోపణలపై జోక్యం జరిగిందా అనే అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. అయితే ఈ ఆరోపణలు దర్యాప్తు దశలోనే ఉన్నాయి. తాజా విచారణకు ఆదేశాలు రావడం లేదా సూసైడ్‌ నోట్‌లో పేరు ఉన్నట్లు చెప్పడం మాత్రమే జ్ఞానేశ్‌ కుమార్‌ తప్పు చేసినట్లు నిర్ధారించదు. విజిలెన్స్‌ విచారణలో వెలువడే ఆధారాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉండనున్నాయి.

You may also like...