టీచర్ల బోధనపై వర్మ తిరుగుబాటు స్వరం
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026
- టీచర్ల బోధనపై వర్మ తిరుగుబాటు స్వరం - September 5, 2026

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ విద్యా వ్యవస్థపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీచర్ చెప్పిన ప్రతి మాటను ప్రశ్నించకుండా గుడ్డిగా కంఠస్థం చేయడం విద్య కాదని, బోధనను సైతం విచక్షణతో ప్రశ్నించే ధైర్యమే నిజమైన విద్యకు పునాది అని వ్యాఖ్యానించారు. తాను ఎవరికీ ‘హ్యాపీ టీచర్స్ డే’ చెప్పడం లేదంటూ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘బోధన’ పేరుతో విద్యార్థులను ఒకే మూసలోకి నెట్టడం వారి సృజనాత్మకతను, స్వతంత్ర ఆలోచనా శక్తిని నిర్వీర్యం చేస్తుందని వర్మ విమర్శించారు. టీచర్ చెప్పేది తప్పు కావొచ్చని, కాలం చెల్లిన భావన కావొచ్చని విద్యార్థి గుర్తించిన క్షణం నుంచే అసలైన అభ్యాసం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ప్రశ్నించకుండా స్వీకరించే విద్య వ్యవస్థ మేధస్సును పదును పెట్టడం కంటే అనుసరణకు అలవాటు చేస్తుందని మండిపడ్డారు.
తన వాదనకు శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్, దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్లను ఉదాహరణలుగా చూపించారు. సంప్రదాయ విద్యా విధానంతో విభేదించిన ఐన్స్టీన్ అనంతరం సాపేక్ష సిద్ధాంతంతో ప్రపంచ విజ్ఞానాన్ని మలుపుతిప్పారని, ఫిల్మ్ స్కూల్లో ప్రవేశం దక్కకపోయినా స్పీల్బర్గ్ ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడిగా ఎదిగారని పేర్కొన్నారు. సిలబస్ గీత దాటిన ఆలోచనలే కొత్త మార్గాలకు బాటలు వేస్తాయని అన్నారు.
ఇంజినీర్లు, వైద్యులు, న్యాయవాదులు విజయవంతం కావడాన్ని చూశానని, కానీ విజయవంతమైన టీచర్ను చూడలేదంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. నిజమైన అభ్యాసం అంటే టీచర్ నేర్పించిన ప్రతిదాన్ని యథాతథంగా స్వీకరించడం కాదని, అవసరమైతే ఆయన చెప్పినదానినే తిరస్కరించి స్వంత ఆలోచనను నిర్మించుకోవడమని వ్యాఖ్యానించారు.
టీచర్లు విద్యార్థులను స్వతంత్ర ఆలోచనాపరులుగా తీర్చిదిద్దడం కంటే అనుచరులుగా మలుస్తున్నారని వర్మ ఆరోపించారు. పిల్లలను పాఠశాలలకు పంపే తల్లిదండ్రులు కూడా తెలియకుండానే వారి ప్రశ్నించే తత్వాన్ని బలహీనపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. జార్జ్ బెర్నార్డ్ షా, ఆస్కార్ వైల్డ్ ఆలోచనలను ప్రస్తావిస్తూ సంప్రదాయాన్ని ప్రశ్నించే మేధస్సే సమాజాన్ని ముందుకు నడిపిస్తుందని సూచించారు. చివరగా, తన వాదనకు కొనసాగింపుగా ‘అందుకే మీకు హ్యాపీ టీచర్స్ డే చెప్పాలని అనుకోవడం లేదు’ అంటూ వర్మ తనదైన ఘాటు వ్యాఖ్యతో ముగించారు.
