చదువుతోనే తలరాత మారుతుంది
- చదువుతోనే తలరాత మారుతుంది - August 14, 2026
- రాజ్యాంగాన్ని గౌరవిద్దాం:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - August 14, 2026
- ప్రజావాణికి పకడ్బందీ కార్యాచరణ - August 14, 2026

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: సమాజంలో అసమానతలను తొలగించి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రీబాయి ఫులే దంపతుల ఆశయాలను ప్రజాపాలనలో కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యే సామాజిక మార్పుకు ప్రధాన ఆయుధమని, చదువు ద్వారానే వ్యక్తి తన తలరాతను మార్చుకుని ఆత్మగౌరవంతో జీవించడంతో పాటు సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందగలడని పేర్కొన్నారు. అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుతూ, కలిసి జీవించే వాతావరణం ఏర్పడినప్పుడే కుల వ్యవస్థను క్రమంగా నిర్మూలించగలమని స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిబా ఫులే, సావిత్రీబాయి ఫులే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
మహనీయుల విగ్రహాలు కేవలం అలంకారప్రాయంగా నిలిచిపోకూడదని, వారి త్యాగాలు, పోరాటాలు, ఆలోచనలు నేటి తరానికి స్ఫూర్తిగా మారాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వెనుకబడిన వర్గాలు, అణగారిన ప్రజలకు విద్యను అందించేందుకు ఫులే దంపతులు సాగించిన పోరాటాన్ని గుర్తు చేశారు. సమాజంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న వివక్షకు విద్య ద్వారానే గట్టి సమాధానం ఇవ్వవచ్చని వారు నిరూపించారని పేర్కొన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వం విద్య, సామాజిక న్యాయం, సమాన అవకాశాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలు కూడా అత్యుత్తమ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు యంగ్ ఇండియా పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. విద్యలో ఆర్థిక అసమానతలు అడ్డంకిగా మారకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్‌కు బలమైన పునాది వేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఏటా రూ.2,400 కోట్ల నిధులను ముందుగానే క్రెడిట్ చేసే విధానాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నెల రోజుల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ అయ్యేలా చర్యలు చేపట్టామని వివరించారు. విద్యార్థుల భవిష్యత్‌ను ఆర్థిక ఇబ్బందులు దెబ్బతీయకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత కేవలం డిగ్రీలు పొందడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని సీఎం సూచించారు. కృత్రిమ మేధస్సు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సంప్రదాయ ఉద్యోగాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని, ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు యువత ముందుగానే సిద్ధం కావాలని అన్నారు. నైపుణ్యం కలిగిన యువతకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో సాంకేతిక నైపుణ్యాలు కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించి అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాలను సమన్వయం చేయడం ద్వారా యువతను భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
చదువుతో పాటు క్రీడల్లోనూ యువత రాణించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. క్రీడలు కేవలం శారీరక దారుఢ్యానికే కాకుండా క్రమశిక్షణ, పట్టుదల, పోటీ తత్వం పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకువచ్చే క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నజరానాలు అందిస్తామని వెల్లడించారు. యువత చదువులు, క్రీడలు, సాంకేతిక రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. అవకాశాలు అందుబాటులోకి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
బలహీన వర్గాల జనాభా వివరాలను సేకరించడంలో తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. జనాభా లెక్కల్లో సామాజిక వాస్తవాలను ప్రతిబింబించాలంటే కులగణన తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు అవసరమైన వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. యువత చదువులు, క్రీడలు, పరిపాలనతో పాటు వివిధ రంగాల్లో రాణించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పారదర్శకమైన, ప్రజలకు జవాబుదారీగా ఉండే పాలనను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఫులే దంపతులు చూపిన విద్య, సమానత్వం, సామాజిక న్యాయం మార్గంలో ముందుకు సాగితేనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని సీఎం స్పష్టం చేశారు





