పంట చేతికొచ్చే వేళ.. నీళ్లెక్కడ? నల్గొండకు రావాల్సిన నీటిని ఖమ్మం, ఆంధ్రాకు తరలించడం అన్యాయం.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

పంట చేతికొచ్చే వేళ.. నీళ్లెక్కడ?

నల్గొండకు రావాల్సిన నీటిని ఖమ్మం, ఆంధ్రాకు తరలించడం అన్యాయం..

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య1000349909.jpg

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 18: నార్లు పోశారు.. నాట్లు వేశారు.. పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. ఇంకో పది, పదిహేను రోజుల్లో చేతికొస్తుందనుకున్న పంటకు ఇప్పుడు నీళ్లే కరువయ్యాయి. పంట కోత దశకు చేరుకున్న సమయంలో సాగునీరు అందక పొలాలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాకు ఏఎమ్మార్పీ ద్వారా రావాల్సిన నీటిని ఖమ్మం జిల్లాకు తరలించడం అన్యాయమన్నారు. నల్గొండ జిల్లాలో పంటలు కీలక దశలో ఉన్న సమయంలో నీటి కొరత ఏర్పడితే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యంగా నకిరేకల్ ప్రాంతానికి ఏఎమ్మార్పీ నీరు సక్రమంగా అందడం లేదని, వెంటనే నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలను నింపాలని డిమాండ్ చేశారు. రైతుల కళ్లముందే పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.

అదేవిధంగా శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. నల్గొండ జిల్లాకు రావాల్సిన నీటిపై జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గతంలో పంటలకు అవసరమైన సమయంలో నీటిని విడుదల చేసేవారని పేర్కొంటూ, ప్రస్తుతం పంట చేతికొచ్చే దశలో నీరు అందక రైతులు నష్టపోతున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి సారించాలని కోరారు. రైతులు, విద్యార్థులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పలగూడెంలో విగ్రహం, షెడ్డు నిర్మాణం విషయంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంపైనా ఆయన స్పందించారు. ప్రభుత్వం, పోలీసుల తీరును ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం సరికాదని, పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా చట్టప్రకారం వ్యవహరించాలని కోరారు. దళితబంధు, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు, ఎస్సీ కార్పొరేషన్, గురుకుల పాఠశాలలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. రైతుల పంటలు ఎండిపోకుండా తక్షణమే సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, నాయకులు గుర్రం గణేష్, పల్లె విజయ్, నోముల కేశవరాజు, రాచకొండ వెంకన్న, పేర్ల కృష్ణకాంత్, చిట్యాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...