నిమజ్జనాల్లో నిర్లక్ష్యానికి నో ఛాన్స్.. శంకర్‌పల్లి సీఐ రుద్వీర్ కుమార్ హెచ్చరిక!
- చౌడర్గూడలో TOSS ప్రవేశాల ప్రచారం - September 19, 2026
- హెచ్-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు - September 19, 2026
- ఎర్రగుట్టలో విషాదం.. గుంతలో పడి ఐదేళ్ల బాలుడు మృతి - September 19, 2026

శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా లోని ఫ్యూచర్ సిటీ పరిధిలోని శంకర్‌పల్లి సీఐ రుద్వీర్ కుమార్ నిమజ్జన వేడుకలపై కఠిన హెచ్చరికలు జారీ చేసారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసి నేటికి ఐదు రోజులు పూర్తికాగా,పలు మండపాల్లో నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం ఏడు, తొమ్మిది రోజుల మండపాల నిమజ్జనాలు కూడా వరుసగా జరిగే అవకాశం ఉండటంతో పోలీస్ యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలకు సిద్ధమవుతోంది. నిమజ్జన ఊరేగింపుల్లో అత్యుత్సాహం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడం, డీజేలు, సౌండ్ సిస్టమ్‌లతో నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని సీఐ రుద్వీర్ కుమార్ హెచ్చరించినట్లు పేర్కొన్నారు.మండపాల నిర్వాహకులు నిమజ్జనానికి ముందే ఊరేగింపు మార్గాలు, వాహనాల నిర్వహణ, భక్తుల రాకపోకలపై తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రధాన రహదారులపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపి ట్రాఫిక్ వ్యవస్థను స్తంభింపజేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత అత్యుత్సాహానికి దూరంగా ఉండాలని, మద్యం సేవించి నిమజ్జన ఊరేగింపుల్లో పాల్గొనడం లేదా వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని సూచించారు. డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల విషయంలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.ఇక చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల వద్ద నిమజ్జనం సమయంలో ప్రాణ భద్రతను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ఈత రాని వ్యక్తులు నీటిలోకి దిగకుండా నిర్వాహకులు పర్యవేక్షించాలని, చిన్నారులు, వృద్ధులు నీటి ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో పోలీసుల సూచనలు పాటిస్తూ క్రమశిక్షణతో వ్యవహరించాలని కోరారు. భక్తి వేడుకల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం వంటి చర్యలకు తావులేదని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ రుద్వీర్ కుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం.
