వి లైవ్ నల్గొండ జిల్లా ఇంచార్జ్
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

జ్ఞాన తెలంగాణ,కొండమల్లేపల్లి, జనవరి 17:
నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గాన్ని తక్షణమే జిల్లాగా ప్రకటించాలని లంబాడీల ఐక్యవేదిక జిల్లా ఇన్‌చార్జ్ కొర్ర నాగరాజ్ నాయక్ డిమాండ్ చేశారు. గిరిజనుల ఆధిక్యతతో కూడిన ఈ ప్రాంతం ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక వెనుకబడి ఉందని తెలిపారు.దేవరకొండ ప్రాంతంలో అధిక సంఖ్యలో గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరిలో ఎక్కువమంది నిరుపేదలేనని చెప్పారు. ప్రభుత్వ పథకాలు సకాలంలో అందకపోవడంతో జీవన పోరాటం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో బతుకుదెరువు కోసం కొందరు గిరిజన కుటుంబాలు తమ ఆడబిడ్డలను అమ్ముకునే దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారంటే ఈ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దుస్థితికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. అభివృద్ధి అన్న మాట వినిపించకుండా, దేవరకొండను కేవలం ఓటుబ్యాంక్‌లా మాత్రమే ఉపయోగించుకున్నారని విమర్శించారు.దేవరకొండను జిల్లాగా ప్రకటిస్తే గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని, ఉపాధి వనరులు పెరుగుతాయని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతులు విస్తరిస్తాయని, ప్రభుత్వ సేవలు ప్రజలకు నేరుగా చేరే అవకాశం ఉంటుందని వివరించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి వెనుకబడిన దేవరకొండకు జిల్లా హోదా ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించాలి. గిరిజనుల అభివృద్ధికి ఇదే సరైన సమయం అని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దేవరకొండ జిల్లా అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.ప్రస్తుతం దేవరకొండ జిల్లా డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వస్తోంది.
