ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై కలెక్టర్ ఫోకస్..పంజుగుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ.!

1001371109.jpg

కల్వకుర్తి,నవంబర్ 17: నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం కల్వకుర్తి మండలంలోని పంజుగుల ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఒకటి నుంచి ఏడు తరగతులకు గాను ప్రస్తుతం 40 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు అధికారులు వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని సూచించారు.అనంతరం తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలు, పరిసరాల పరిశుభ్రతతో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. భోజనం తయారీలో పరిశుభ్రత పాటిస్తూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ తనిఖీలో తహసీల్దార్ ఇబ్రహీం, ఎంపీడీవో యాదయ్య, మండల విద్యాధికారి శంకర్ నాయక్, గ్రామ సర్పంచ్ పర్వతాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

You may also like...