ఉమ్మెంత్యాలలో పారిశుద్ధ్య కార్మికుడిపై దాడి..


తలకు తీవ్ర గాయాలు, ఉస్మానియాకు తరలింపు


రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం ఉమ్మెంత్యాల గ్రామంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిపై జరిగిన దాడి కలకలం రేపింది. గ్రామపంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్‌కు దారి ఇవ్వాలని కోరినందుకు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
స్థానికుల వివరాల ప్రకారం, గ్రామపంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న బ్యాగారి యాదయ్య చెత్త సేకరణ విధులు నిర్వహిస్తుండగా, దారికి అడ్డంగా నిలిపిన వాహనాన్ని కొద్దిగా పక్కకు తీయాలని కోరాడు. దీంతో కబ్బిరి వీరేశం, కబ్బిరి భూషయ్య ఆగ్రహానికి గురై యాదయ్యపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ దాడిలో యాదయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, పారిశుద్ధ్య కార్మికులు అధికారులను డిమాండ్ చేశారు.
గమనిక: దాడికి పాల్పడిన వారి పేర్లు స్థానికుల ఆరోపణల ఆధారంగా పేర్కొనబడ్డాయి. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంది..

You may also like...