సోనియాకు కోర్టు ఝలక్!
- పోయిన ఫోన్లకు భరోసా.. CEIRతో రికవరీ! - November 6, 2026
- ప్రభుత్వ అధికారి ముసుగులో మోసాలు! - November 6, 2026
- ఓటర్లకు మరో ఛాన్స్! - November 6, 2026

- 1980 ఓటర్ల జాబితాలో పేరు ఉందన్న ఆరోపణ
- 1983లో భారత పౌరసత్వం పొందినట్లు పిటిషన్లో ప్రస్తావన
- మేజిస్ట్రేట్ ఉత్తర్వును కొట్టివేసిన ప్రత్యేక కోర్టు
- కేసును తిరిగి విచారించాలని ఆదేశం
- సెప్టెంబర్ 29న తదుపరి విచారణ
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సంబంధించిన ఓటర్ల జాబితా వివాదం మరోసారి న్యాయస్థానం ముందుకు వచ్చింది. 1983లో భారత పౌరసత్వం పొందడానికి ముందే 1980లో ఆమె పేరు న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో నమోదైందన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లో దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరిస్తూ గతంలో మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వును ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే కొట్టివేసి, పిటిషన్ను తిరిగి విచారించాలని ఆదేశించారు.
అడ్వకేట్ వికాస్ త్రిపాఠి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్లో.. సోనియా గాంధీ పేరు 1980 ఓటర్ల జాబితాలో నమోదైందని, అయితే ఆమెకు భారత పౌరసత్వం 1983 ఏప్రిల్ 30న లభించిందని ఆరోపించారు. 1980లో పేరు నమోదై, 1982లో తొలగించబడిందని, అనంతరం 1983లో మళ్లీ ఓటర్ల జాబితాలో కనిపించిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన కోరారు.
అయితే ఈ ఆరోపణలను సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. పిటిషన్ రాజకీయ ప్రేరేపితమైనదని, ఆధారాలు లేని ఊహాగానాలపై ఆధారపడి ఉందని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఓటరు నమోదుకు సంబంధించిన అసలు దరఖాస్తులు, పౌరసత్వ పత్రాలు లేదా నకిలీ పత్రాలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను పిటిషనర్ సమర్పించలేదని వాదించారు.
గతంలో మేజిస్ట్రేట్ ఈ పిటిషన్ను తిరస్కరించారు. అయితే ఆ ఉత్తర్వును పరిశీలించిన ప్రత్యేక న్యాయస్థానం, ఫిర్యాదులో గుర్తించదగిన నేరం జరిగినట్లు వెల్లడవుతోందా అనే అంశాన్ని తగిన విధంగా పరిశీలించలేదని పేర్కొంది. ముఖ్యంగా BNSS నిబంధనల ప్రకారం పోలీసుల నుంచి స్టేటస్ రిపోర్ట్ తీసుకోవడం, సంబంధిత పోలీసు అధికారుల వాదనలు పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాల్లో లోపాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది.చట్టపరమైన ప్రత్యామ్నాయాలపై కూడా మేజిస్ట్రేట్ తగిన పరిశీలన చేయలేదని కోర్టు పేర్కొంది. దీంతో గత ఉత్తర్వును పక్కనబెట్టి, ఫిర్యాదును కొత్తగా పరిశీలించి కారణాలతో కూడిన ఉత్తర్వు జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 29కు వాయిదా వేసింది. తాజా ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు గానీ, సోనియాపై ఆరోపణలు రుజువైనట్లు గానీ అర్థం కాదు; పిటిషన్పై పునర్విచారణకు మాత్రమే కోర్టు మార్గం సుగమం చేసింది.
