ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలి: టీయూటీఎఫ్


జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి, ఆగస్టు 8:

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రెండో వేతన సవరణ కమిషన్ (PRC)ను వెంటనే ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TUTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రఘునందన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీయూటీఎఫ్ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం శంకర్‌పల్లిలో సంఘ జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో చారిత్రక అవసరంగా టీయూటీఎఫ్ ఏర్పాటైందని, అప్పటి నుంచి ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. మూడు సంవత్సరాలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ప్రతి ఉద్యోగికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఆర్థిక నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పీఆర్సీ నివేదికను వెంటనే బహిర్గతం చేసి అమలు చేయాలని, పెండింగ్ డీఏలు, బిల్లులు, ఇతర ఆర్థిక బకాయిలన్నింటినీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మునీర్ పాషా, జిల్లా ఉపాధ్యక్షులు కె. నారాయణ, జిల్లా కార్యదర్శి ఏ. సుదర్శన్, రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. మొగులయ్య, టీయూటీఎఫ్ శంకర్‌పల్లి అధ్యక్షుడు డి. అంజయ్య, ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాస్ చారి, కొందుర్గు ప్రధాన కార్యదర్శి బి. దేవేందర్ రెడ్డి, చేవెళ్ల ప్రధాన కార్యదర్శి ఎం. శివానందం, ఉపాధ్యక్షుడు బి. మోహన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు ఎం. వెంకటేశ్వర్ రావు, జగదీశ్వర్, బాబు నాయక్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు, సంఘ నాయకులు పాల్గొన్నారు
.

You may also like...