విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా..? సరుకు వాహనంలో జోగిపేట విద్యార్థుల ప్రమాదకర ప్రయాణం
- విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా..? సరుకు వాహనంలో జోగిపేట విద్యార్థుల ప్రమాదకర ప్రయాణం - September 23, 2026
- గణనాథునికి మొక్కు చెల్లించిన గిర్మాపూర్ యువకులు - September 22, 2026
గిర్మాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న జోగిపేట విద్యార్థులను సరుకు రవాణా వాహనంలో ఎలాంటి కనీస భద్రతా చర్యలు లేకుండా ప్రమాదకరంగా తరలిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులు వాహనం వెనుక భాగంలో నిల్చొని ప్రయాణిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.
జోగిపేట నుంచి గిర్మాపూర్ వైపు వచ్చే మార్గంలో బొంబాయి, నాందేడ్ వంటి రద్దీ జాతీయ రహదారులు ఉండగా.. విద్యార్థులను ఇలా తరలించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చిన్నపాటి పొరపాటు జరిగినా విద్యార్థుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల భద్రత విషయంలో ఇంతటి నిర్లక్ష్యానికి బాధ్యులెవరు..? ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే పరిస్థితి కాకుండా ముందుగానే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కలెక్టర్ గారు తక్షణమే ఈ ఘటనపై దృష్టిసారించి, విద్యార్థులను ఇలాంటి ప్రమాదకర వాహనాల్లో తరలించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులతో విచారణ చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
