స్వర్ణ సంచలనం..లంకపై భారత్‌ ఘన విజయం!

జ్ఞానతెలంగాణ,స్పోర్ట్స్ ప్రతినిధి :
ఆసియా క్రీడలు–2026 మహిళల క్రికెట్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. నిషిన్‌లోని కోరోగీ స్పోర్ట్స్‌ పార్క్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ పోరులో టీమిండియా 147 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన హర్మన్‌ప్రీత్‌ సేన.. ఆసియా క్రీడల్లో మరోసారి గోల్డ్‌ మెడల్‌ను ఒడిసిపట్టుకుంది. 2022లో సాధించిన స్వర్ణాన్ని కొనసాగిస్తూ భారత మహిళల జట్టు మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
టాస్‌ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఏకంగా 216 పరుగులు చేసింది. ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ శ్రీలంక బౌలర్లపై ఆరంభం నుంచే విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీ స్కోరుకు బలమైన పునాది వేశారు. షఫాలీ వర్మ 48 పరుగులతో కీలక పాత్ర పోషించగా.. స్మృతి మంధాన కేవలం 45 బంతుల్లోనే 79 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడింది. ఆమె ఖాతాలో ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో మంధాన మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 11 వేల పరుగుల మైలురాయిని కూడా చేరుకుంది.
కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 19 పరుగులు చేయగా.. రిచా ఘోష్‌ చివరి వరకు దూకుడుగా ఆడి అజేయంగా 49 పరుగులు సాధించింది. దీంతో భారత్‌ 216 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. శ్రీలంక బౌలర్లలో సుగంధికా కుమారి, కవిషా దిల్హరి, చాముది ప్రభోద తలో వికెట్‌ తీసుకున్నారు.
భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు ఏమాత్రం ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వలేదు. వరుస వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. కేవలం 15.4 ఓవర్లలోనే శ్రీలంక మొత్తం 10 వికెట్లు కోల్పోయి 69 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో భారత్‌ 147 పరుగుల భారీ తేడాతో విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌లో భారీ స్కోరు, బౌలింగ్‌లో పదునైన దాడితో టీమిండియా ఫైనల్‌లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ విజయంతో భారత మహిళల క్రికెట్‌ జట్టు ఆసియా క్రీడల వేదికపై మరోసారి స్వర్ణ చరిత్రను లిఖించింది.

You may also like...