మీసేవ సేవలు ఇక ఇంటి వద్దకే..
- మీసేవ సేవలు ఇక ఇంటి వద్దకే.. - November 12, 2026
- డంప్‌యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారం కై,మంత్రి శ్రీధర్ బాబుకు వినతి - November 12, 2026
- తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు. - November 12, 2026
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్డీ) శాఖ, సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్తంగా ‘మీ సేవ డోర్‌స్టెప్ డెలివరీ’ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించాయి. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, గేటెడ్ కమ్యూనిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జి. శ్రీజన, ఐఏఎస్, ఈఎస్డీ కమిషనర్ టి. రవి కిరణ్, ఐఎఫ్ఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రవి కిరణ్ మీ సేవ డోర్‌స్టెప్ డెలివరీ సేవలను వివరించారు. శిక్షణ పొందిన, ధ్రువీకరించిన ప్రతినిధులు నేరుగా ఇళ్ల వద్దకే వచ్చి ప్రభుత్వ సేవలను అందిస్తారని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యోగులకు ఈ విధానం ఎంతో ప్రయోజనకరమన్నారు.
ఈ సేవల కోసం 1100 నంబర్‌కు కాల్ చేసి 1 నొక్కాలని లేదా https://dsd.meeseva.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
అదేవిధంగా సైబరాబాద్ మూవ్స్ కార్యక్రమం ద్వారా పర్యావరణహిత రవాణా వ్యవస్థ ఆవశ్యకతను వివరించారు. మీటికెట్ యాప్ ద్వారా బస్సు, మెట్రో టికెట్లతో పాటు బస్ పాస్‌లు, పార్కుల టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాలను పరిచయం చేశారు. ఈ సేవలపై తమ కమ్యూనిటీల్లో వాట్సాప్ గ్రూపులు, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఆర్డబ్ల్యూఏ ప్రతినిధులకు సూచించారు.

