బీసీ ర్యాలీకి రాహుల్‌కు ఆహ్వానం!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణలో బీసీల రాజకీయ ప్రాతినిధ్య అంశాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో మెగా బీసీ ర్యాలీ నిర్వహణకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. మంగళవారం రాహుల్ గాంధీతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరాన్ని వివరించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో ఓబీసీలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంపై చర్చించినట్లు పేర్కొన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంస్థాగత కార్యక్రమాలను రాహుల్‌కు వివరించానన్నారు. నవంబర్ 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని ఆహ్వానించగా రాహుల్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. భారత్ సమ్మిట్‌తో పాటు గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని రాహుల్ సూచించినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో వారితో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిర్వహించనున్న సభపైనా చర్చించినట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో మంత్రులు, ఎంపీల మధ్య విభేదాలు, ఢిల్లీలో జరిగిన పరిణామాలపై ఈ భేటీలో చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఆ అంశాలను పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పరిశీలిస్తారని పేర్కొన్నారు. నవంబర్ చివరి నాటికి రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. సోనియా గాంధీ జీవిత విశేషాలతో వెలువడిన పుస్తకంపై తెలంగాణలోనూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, పార్టీ బలోపేతం, గిగ్ వర్కర్ల సంక్షేమం వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయని ఆయన వివరించారు.

You may also like...