హైదరాబాద్‌ సీపీగా మహేష్‌ భగవత్‌

జ్ఞాన తెలంగాణ,ప్రత్యేక కథనం: హైదరాబాద్‌ మహానగర పోలీస్‌ కమిషనర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేష్‌ భగవత్‌ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు మూడు దశాబ్దాల పోలీస్‌ సర్వీసులో వివిధ హోదాల్లో పనిచేసి పరిపాలనా అనుభవాన్ని, క్షేత్రస్థాయి పరిజ్ఞానాన్ని సంపాదించుకున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించింది. 1995 బ్యాచ్‌కు చెందిన మహేష్‌ భగవత్‌ లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌, ముస్సోరీలో ఫౌండేషన్‌ కోర్సు పూర్తిచేసి, హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ శిక్షణ పొందారు. అనంతరం మణిపూర్‌లో రెండేళ్లపాటు సేవలందించారు. 1999లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపుతో సమైక్య రాష్ట్రంలో తన పోలీస్‌ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆదిలాబాద్‌, నల్గొండ, కడప, ఖమ్మం జిల్లాల్లో ఎస్పీగా పనిచేయడంతోపాటు హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్లలో డీసీపీ, జాయింట్‌ సీపీ వంటి కీలక బాధ్యతలు నిర్వహించారు. సీఐడీలో ఎస్పీగా, ఏలూరు రేంజ్‌లో డీఐజీగా, ఐఎస్‌డబ్ల్యూలో డీఐజీగా కూడా సేవలందించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014లో తెలంగాణ క్యాడర్‌కు కేటాయించబడ్డారు. ఐఎస్‌డబ్ల్యూలో ఐజీగా పనిచేసిన ఆయన 2016 జూలైలో కొత్తగా ఏర్పాటైన రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌కు తొలి కమిషనర్‌గా నియమితులయ్యారు. 2022 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగి తనదైన ముద్ర వేశారు. అనంతరం 2023లో సీఐడీ ఏడీజీగా, ఆ తర్వాత రైల్వేలు, రోడ్డు భద్రత విభాగంలో ఏడీజీగా బాధ్యతలు నిర్వహించారు. 2024 నుంచి లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీపీగా పనిచేశారు. పోలీసింగ్‌లో వినూత్న విధానాలు, ప్రజల భాగస్వామ్యం, మానవ అక్రమ రవాణా నిరోధం వంటి అంశాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆదిలాబాద్‌లో ‘పోలీస్‌ మీకోసం’, నల్గొండలో ‘ప్రాజెక్ట్‌ ఆసరా’ వంటి కార్యక్రమాలు ఆయన సేవా దృక్పథానికి నిదర్శనంగా నిలిచాయి. పోలీస్‌ శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2022లో రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకాన్ని అందుకున్నారు. గతంలో రాష్ట్రపతి పోలీస్‌ శౌర్య పతకం, మెరిటోరియస్‌ సర్వీస్‌ పోలీస్‌ పతకం కూడా పొందారు. ఇప్పుడు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో సైబర్‌ నేరాల నియంత్రణ, డ్రగ్స్‌ కట్టడి, మహిళల భద్రత, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారం, శాంతిభద్రతల పరిరక్షణ ఆయన ముందున్న ప్రధాన సవాళ్లుగా నిలవనున్నాయి. సుదీర్ఘ అనుభవం, పరిపాలనా దక్షతతో మహానగర పోలీస్‌ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

You may also like...