కర్రెగుట్టలో శాంతి జెండా


జ్ఞానతెలంగాణ,ములుగు:
ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు ప్రధాన స్థావరంగా, భద్రతా బలగాలకు అత్యంత సవాల్‌గా నిలిచిన తెలంగాణ–ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దులోని కర్రెగుట్ట ఇప్పుడు శాంతి, భద్రత, అభివృద్ధి దిశగా పయనిస్తోందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం కర్రెగుట్టలో పర్యటించిన ఆయన అక్కడ కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, శాంతికి ప్రతీకగా తెల్ల పావురాలను ఎగురవేశారు. దశాబ్దాలుగా తీవ్రవాద ప్రభావంతో వెనుకబడిన ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకోవడం శాంతి పునరుద్ధరణకు నిదర్శనమని పేర్కొన్నారు.
పోలీసు, సీఆర్పీఎఫ్, అటవీ, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులతో కలిసి కర్రెగుట్ట పరిసర ప్రాంతాలను పరిశీలించిన డీజీపీ.. గత పరిస్థితులను, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు, సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు, ఛత్తీస్‌గఢ్ పోలీసుల మధ్య సమన్వయం కారణంగానే మావోయిస్టు ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు. ఆపరేషన్ కగార్ చర్యల ఫలితంగా సుమారు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని, పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో మృతిచెందగా, మరికొందరు హింసాత్మక మార్గాన్ని వీడి సాధారణ జీవితంలోకి వచ్చారని వివరించారు.
మావోయిజం ప్రభావం తగ్గిన తర్వాత కర్రెగుట్టలో అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకున్నాయని డీజీపీ పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల పాటు రహదారులు, విద్యుత్, కమ్యూనికేషన్ వంటి కనీస మౌలిక వసతులకు దూరంగా ఉన్న ప్రాంతాలకు ఇప్పుడు ప్రభుత్వ సేవలను చేరువ చేస్తున్నామని తెలిపారు. భద్రతా బలగాల నిరంతర చర్యలతో ఏర్పడిన అనుకూల వాతావరణాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అనుసంధానిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరిగేలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.


లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని సీవీ ఆనంద్ వెల్లడించారు. వారికి ఆర్థిక సహాయం, భూముల కేటాయింపు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సాధారణ జీవనంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తిరిగి హింసాత్మక కార్యకలాపాల వైపు వెళ్లకుండా సమాజంలో స్థిరపడేలా నిరంతర పర్యవేక్షణతో పాటు అవసరమైన సహకారం అందిస్తున్నామని తెలిపారు. పునరావాస విధానం కేవలం లొంగిపోయిన వ్యక్తుల జీవితాలను మార్చడమే కాకుండా, హింస ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత శాంతి నెలకొల్పడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
కర్రెగుట్టకు పర్యాటక రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని డీజీపీ తెలిపారు. ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుతూ, పర్యావరణ మరియు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇప్పటికే పామూరు నుంచి చలమడ వరకు తారు రహదారి పనులు పూర్తయ్యాయని, త్వరలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. పర్యాటకుల రాకపోకలకు అనువుగా రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక ప్రజలకు కూడా మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
కర్రెగుట్ట అభివృద్ధికి రహదారులతో పాటు విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్, ఇతర మౌలిక వసతులను కూడా కల్పించనున్నట్లు డీజీపీ తెలిపారు. ఒకప్పుడు భద్రతా పరంగా అత్యంత సున్నిత ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో శాంతి, ప్రకృతి, పర్యాటకానికి చిరునామాగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అయితే అభివృద్ధి పేరుతో పర్యావరణానికి నష్టం కలగకుండా అన్ని నిబంధనలను కచ్చితంగా పాటిస్తామని స్పష్టం చేశారు.


పామూరు శిబిరం సమీపంలోని గుత్తికోయ కుటుంబాలను డీజీపీ సీవీ ఆనంద్ పరామర్శించారు. వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది చేసిన సేవలను డీజీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు. కుటుంబాలకు నెలల తరబడి దూరంగా ఉంటూ, అడవులు, కొండలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ 196 బెటాలియన్ సిబ్బంది త్యాగాలు శాంతి పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. భద్రతా బలగాల కఠోర శ్రమ, శాఖల మధ్య సమన్వయం, ప్రభుత్వ అభివృద్ధి చర్యల సమ్మిళిత ఫలితంగానే కర్రెగుట్టలో పరిస్థితులు మారుతున్నాయని అన్నారు.
డీజీపీ పర్యటనలో అదనపు డీజీపీ సంజయ్ జైన్, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, ఎస్‌ఐబీ ఎస్పీ సింధు శర్మ, ములుగు కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ములుగు ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, సీఆర్పీఎఫ్ అధికారులు, రెవెన్యూ, పర్యాటక శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒకప్పుడు తుపాకుల మోతతో మార్మోగిన కర్రెగుట్టలో ఇప్పుడు జాతీయ పతాకం రెపరెపలాడటం, శాంతికి ప్రతీకగా తెల్ల పావురాలు ఎగరడం మారుతున్న పరిస్థితులకు ప్రతీకగా నిలిచింది. భద్రతా స్థావరం నుంచి అభివృద్ధి కేంద్రంగా, భయానికి చిరునామా నుంచి పర్యాటక గమ్యస్థానంగా కర్రెగుట్ట రూపాంతరం చెందే దిశగా అడుగులు పడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

You may also like...