నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి!

  • 18 ఏళ్ల హరిణి మృతిపై కలకలం
  • ఒళ్లంతా గాయాలతో మృతదేహం
  • మెడపై నులిమిన ఆనవాళ్లు
  • ప్రేమ పేరుతో వేధింపుల ఆరోపణలు
  • 24 గంటల్లో నిందితులను గుర్తించాలన్న తుమ్మల

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, జూలూరుపాడు, సెప్టెంబర్‌ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో నర్సింగ్‌ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇంట్లోనే ఉన్న హరిణి.. తల్లి బయటకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి ఇంటి మరుగుదొడ్డి వెనుకభాగంలో ఒళ్లంతా గాయాలతో విగతజీవిగా కనిపించింది. మృతురాలి ముక్కు నుంచి రక్తం రావడం, మెడపై నులిమిన ఆనవాళ్లు ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమార్తెను ప్రేమించాలంటూ అదే గ్రామానికి చెందిన పవన్‌కుమార్‌ గతంలో వేధించాడని, పెళ్లికి నిరాకరిస్తే చంపేస్తానంటూ బెదిరించాడని మృతురాలి తల్లి రాజేశ్వరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్‌కుమారే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది. ఘటనపై న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ కుటుంబ సభ్యులు జూలూరుపాడు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజుతో ఫోన్‌లో మాట్లాడి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి కేసును వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. 24 గంటల్లో నిందితులను గుర్తించి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.

You may also like...