26 నుంచి చీరలు, పింఛన్ల పంపిణీ!
- 26 నుంచి చీరలు, పింఛన్ల పంపిణీ! - November 19, 2026
- 26న పింఛన్ల జాతర! - November 19, 2026
- ఆయిల్‌పామ్‌లో తెలంగాణ అగ్రస్థానం! - November 19, 2026

హైదరాబాద్ :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరలు, చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి కొత్త తేదీ ఖరారైంది. ముందుగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అనివార్య కారణాలతో కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26 నుంచి పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలకు ఆత్మగౌరవం, సామాజిక గుర్తింపు కల్పించడంతో పాటు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో చీరలను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. మరోవైపు కొత్తగా మంజూరైన లబ్ధిదారులతో కలిపి మొత్తం 4,63,857 మందికి చేయూత పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన వర్గాలకు ఈ పింఛన్లు ఆర్థికంగా అండగా నిలవనున్నాయి.
ముందుగా ప్రకటించిన తేదీ మారడంతో లబ్ధిదారుల్లో కొంత నిరీక్షణ నెలకొన్నప్పటికీ, నవంబర్ 26 నుంచి పంపిణీ ప్రారంభం కానుండటంతో ఆశలు చిగురిస్తున్నాయి. పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంది. ప్రకటించిన తేదీ ప్రకారం చీరలు, పింఛన్ల ప్రయోజనాలు అర్హులందరికీ చేరితే లక్షలాది కుటుంబాలకు ఊరట లభించనుంది.
