రూ.3.50 లక్షలకే ఇందిరమ్మ ఫ్లాట్‌!

తెలంగాణలో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ పథకంలో భాగంగా కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలోని హైదరాబాద్‌ను మినహాయించి మిగతా మున్సిపల్‌ కార్పొరేషన్లలో నిర్మించే ఫ్లాట్లను లబ్ధిదారులకు రూ.3.50 లక్షలకే అందించాలని నిర్ణయించింది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా నాలుగు విడతల్లో చెల్లించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఫ్లాట్‌ కేటాయింపు సమయంలో రూ.లక్ష, ఆర్‌సీసీ నిర్మాణ దశలో రూ.లక్ష, ఫినిషింగ్‌ పనుల సమయంలో మరో రూ.లక్ష, మిగిలిన రూ.50 వేలను ఫ్లాట్‌ కేటాయింపు ప్రక్రియలో చెల్లించాల్సి ఉంటుంది.

తొలి విడతలో 2,400 ఫ్లాట్లు

మొదటి విడతలో ఐదు ప్రాంతాల్లో 480 చొప్పున మొత్తం 2,400 ఫ్లాట్లు నిర్మించేందుకు హౌసింగ్‌ శాఖ ప్రకటన విడుదల చేసింది. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని గీసుకొండ మండలం గొర్రెకుంట, కాజీపేట మండలం మడికొండ, నిజామాబాద్‌ జిల్లా నాగారం పరిధిలోని ఆర్‌జీకే కాలనీ, నల్గొండ జిల్లాలోని మామిళ్లగూడ డీవీకే రోడ్డు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బండమీదిపల్లిలో నిర్మాణాలు చేపట్టనున్నారు. త్వరలోనే ఈ ప్రాంతాల్లో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.

దరఖాస్తు, అర్హతలు ఇలా..

మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఒక యూనిట్‌గా పరిగణించి దరఖాస్తులు స్వీకరిస్తారు. సంబంధిత కార్పొరేషన్‌ పరిధిలో నివసించే అల్పాదాయ వర్గాల (ఎల్‌ఐజీ) ప్రజలు ఇందిరమ్మ ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ నమోదు సమయంలో ఆధార్‌ కార్డు నంబరు నమోదు చేయాలి. మీ సేవా కేంద్రాల ద్వారా రూ.100 రుసుము చెల్లించి దరఖాస్తు సమర్పించాలి. టోకెన్‌ అడ్వాన్స్‌గా రూ.10 వేలు చెల్లించాలి. ఫ్లాట్‌ కేటాయింపు జరగని వారికి ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఒక్కో ఫ్లాట్‌ను 512 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షల సబ్సిడీ అందించడంతో పాటు స్థలంలో అన్‌డివైడెడ్‌ షేర్‌ కల్పించనుంది. సంబంధిత కార్పొరేషన్‌ పరిధిలో దరఖాస్తుదారుడికి లేదా కుటుంబానికి ఇల్లు, ప్లాటు ఉండకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల్లోపు ఉండాలి. కేటాయించిన ఫ్లాట్‌ను పదేళ్లపాటు విక్రయించడానికి, అద్దెకు ఇవ్వడానికి అనుమతి ఉండదు. అయితే బ్యాంకు రుణం పొందేందుకు అవకాశం కల్పించారు.

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

అర్హుల ఎంపికలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా 360 డిగ్రీల కోణంలో విచారణ చేపట్టనున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం లాటరీ విధానంలో ఫ్లాట్లను కేటాయిస్తారు. ఎంపికైన లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలిస్తారు. పథకానికి సంబంధించి సందేహాల నివృత్తి కోసం 040-24603572 నంబరుతో ప్రత్యేక కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశారు.

రెండేళ్లలో మరిన్ని కార్పొరేషన్లకు విస్తరణ

తొలి విడతలో ఫ్లాట్ల కేటాయింపు పూర్తయిన అనంతరం మిగతా మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్స్‌ నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో హౌసింగ్‌ బోర్డుకు అందుబాటులో ఉన్న స్థలాల వివరాలను అధికారులు సేకరించారు. మరోవైపు కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా మరో 4 వేల ఫ్లాట్లు నిర్మించే ప్రతిపాదనపై నిబంధనలు రూపొందిస్తున్నారు. మొత్తంగా వచ్చే రెండేళ్లలో ఇందిరమ్మ టవర్స్‌ పథకం ద్వారా పేదలకు పెద్ద సంఖ్యలో గృహాలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

You may also like...